ఎన్నికల ఏటికి ఎదురీతే!

3 Mar, 2014 05:20 IST|Sakshi
ఎన్నికల ఏటికి ఎదురీతే!


, కాకినాడ :
 జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒకప్పుడు  బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి.. వచ్చే ఎన్నికల్లో ఎదురీత సాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెత్తు పోకడలతో ఇక్కడ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోయి పదేళ్లు దాటిపోవడం, వనమాడి వ్యవహార శైలితో పార్టీ శ్రేణులు విసిగి వేసారిపోవడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. దాదాపు ముఖ్య నేతలంతా    ొంతకాలంగా వనమాడికి దూరమైపోయారు. ఆయన సొంత అజెండాతో ముందుకు పోవడమే ఈ పరిణామానికి మూలమని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడి పని చేసేవారిని దూరం పెట్టడమే వనమాడి పట్ల విముఖతకు దారి తీశాయంటున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పార్టీ మనుగడ ఏమి కానుందోనని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడలో నెలకొన్న దుస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పూనుకుంటున్నారని సమాచారం. ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో వనమాడిని నమ్ముకుంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరమేనని నాయకత్వం భావిస్తోంది. గత ఏడాది ‘వస్తున్నా మీకోసం’ కార్యక్రమానికి జిల్లాకు వచ్చినప్పుడే వనమాడి తీరుపై పార్టీ శ్రేణులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.
 

 పార్టీ శ్రేణుల్లో నిస్పృహ
 

మత్స్యకార ప్రతినిధిగా ఉంటూ సొంత సామాజికవర్గంలోని వాడబలిజ, అగ్నికుల క్షత్రియ వర్గాలను సమన్వయం చేయలేక చేతులెత్తేసిన వనమాడి.. ఇక ఇతర వర్గాలను ఏ రకంగా ఆకట్టుకోగలుగుతారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో సొంత సామాజికవర్గం ఆగ్రహాన్ని చవి చూసిన వనమాడి ఇప్పుడు కూడా ఆ  వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయకపోగా, కొందరిని దూరం పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో వారు ఆయన మీద గుర్రుగా ఉన్నారు. దాదాపు ఇదే పరిస్థితిఇతర సామాజికవర్గ నేతల్లో కూడా నెలకొంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన బోళ్ల కృష్ణమోహన్, పార్టీ నగర అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు, నగర తెలుగుయువత అధ్యక్షుడు కత్తిపూడి శ్రీను, వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్‌గా పని చేసిన యనమదల రవితో పాటు కాకినాడలో మాజీ కార్పొరేటర్‌లు, మాజీ కౌన్సిలర్లందరూ వనమాడికి దాదాపుగా దూరమయ్యారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లు మాత్రమే ఆయన వెంట మిగిలారు. చివరకు ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వనమాడి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహార శైలి వల్లే వనమాడి గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారని, పలు డివిజన్లలో కనీసం పార్టీ జెండా కూడా కట్టే నాథుడే లేకుండా పోయాడని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించకపోవడంతో ప్రజలు గత ఎన్నికల్లో కాకినాడలో టీడీపీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే నాయకత్వంతో ఎన్నికలను ఎదుర్కొంటే గెలుపు కష్టమన్న నిస్పృహ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
 బరి కొట్టనున్న ‘ముత్తా’?

 ఈ పరిస్థితుల్లో కాకినాడలో వనమాడికి ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అటు అధిష్టానం, ఇటు నాయకులు, కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వయసు రీత్యా రాజకీయాల్లో అంత చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారు. ఫలితంగా తన కుమారుడు శశిధర్‌కు టిక్కెట్టు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అది వీలు కాకపోతే తానే రంగంలోకి దిగేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వనమాడి రాజకీయ భవితవ్యం, జిల్లా కేంద్రంలో టీడీపీ పరిస్థితి ఏమి కానున్నాయో కొద్ది రోజుల్లో తేలనుంది.  

>
మరిన్ని వార్తలు