వాణిజ్య వర్గాల ఖిల్లా ..విజయవాడ పశ్చిమ

25 Mar, 2019 12:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ పశ్చిమ : విజయవాడ పశ్చిమ నియోజకరవర్గం వ్యాపార, వాణిజ్య రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో తొలినాటి నుంచి  వ్యాపార రాజధానిగా పేరుగాంచిన విజయవాడ నగరంలో అత్యధిక వ్యాపారం ఈ నియోజక   వర్గంలోనే జరుగుతుంది. అంతేకాదు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నియోజకవర్గంలోనే కొలువై ఉంది. అలాగే కృష్ణానది నుంచి తూర్పుకృష్ణకు వెళ్లే సాగునీరు ఈ నియోజకవర్గం నుంచి కదులుతుంది. ప్రకాశం బ్యారేజీ కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంది.

పర్యాటక విషయంలోనూ..
పర్యాటకానికి వస్తే కృష్ణానది మధ్యలో విస్తరించి ఉన్న భవానీ ద్వీపానికి ఈ నియోజకవర్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన మహాత్మాగాంధీ స్మారకార్ధం ఏర్పాటు చేసిన గాంధీహిల్‌ ఈ నియోజకవర్గంలో దర్శనమిస్తుంది. దేశంలోనే పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటిగా పిలిచే విజయవాడ రైల్వేస్టేషన్‌ కూడా ఈ నియోజకవర్గంలోనే   కనిపిస్తుంది. 

మూడోవంతు డివిజన్లు...
విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని మూడో వంతు డివిజన్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నగరపాలకసంస్థ పరిధిలోని 25 నుంచి 41వ డివిజన్‌ వరకూ, అలాగే 48 నుంచి 50వ డివిజన్‌ వరకూ మొత్తం 20 డివిజన్లు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. తూర్పు రైల్వేలైన్, సెంట్రల్‌ నియోజకవర్గం, దక్షిణం కృష్ణానది, పడమర, ఉత్తర దిక్కుల్లో మైలవరం నియోజకవర్గం హద్దులుగా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారులు  ఇక్కడి నుంచే వెళ్తాయి. 

నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు

  • 1953లో మొదటి సారిగి తమ్మిన పోతరాజు కాంగ్రెస్‌ అభ్యర్ధి మరుపిళ్ల చిట్టిపై గెలుపొందారు.
  • 1958లో మరుపిళ్ల చిట్టి సీపీఐ అభ్యర్ధి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు.
  • 1962లో తమ్మిన పోతరాజు మరుపిళ్ల చిట్టిపై గెలిచారు.
  • 1967లో మరుపిళ్ల చిట్టి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు.
  • 1972 కాంగ్రెస్‌ నేత ఆసిఫ్‌పాషా తమ్మిన పోతరాజుపై గెలిచారు.
  • 1978లో పోతిన చిన్నా జెఎన్‌పీ అభ్యర్ధి ఇంతియాజుద్దీన్‌పై గెలిచారు.
  • 1983 టీడీపీ అభ్యర్ధి బీఎస్‌ జయరాజు స్థానిక సీపీఐ అభ్యర్ధి ఉప్పలపాటి రామచంద్రరాజుపై గెలిపొందారు.
  • 1985లో ఉప్పలపాటి రామచంద్రరాజు కాంగ్రెస్‌ అభ్యర్థ్ధి ఎంకేబేగ్‌పై గెలిచారు.
  • 1989లో ఎంకేబేగ్‌ సీపీఐ అభ్యర్ధి కే.చంద్రశేఖరరావుపై గెలిచారు.
  • 1994లో సీపీఐ అభ్యర్ధి కే.సుబ్బరాజు ఎంకే బేగ్‌పై గెలిచారు.
  • 1999లో కాంగ్రెస్‌ అభ్యర్ధి జలీల్‌ఖాన్‌ టీడీపీ అభ్యర్ధి నాగుల్‌మీరాపై గెలిచారు.
  • 2004లో సీపీఐ అభ్యర్ధి షేక్‌ నాసర్‌వలీ టీడీపీ అభ్యర్ధి ఎంకేబేగ్‌పై గెలిచారు.
  • 2009లో వెలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్‌ అభ్యర్ధిని మల్లికాబేగంపై గెలిచారు.
  • 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా జలీల్‌ఖాన్‌ బీజేపీ పక్షాన పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావుపై గెలుపొందారు.

ఆధ్యాత్మికంగానూ...
ఈ నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఒకవైపు కొండపైన కొలువై ఉన్న కనకదుర్గమ్మతో పాటుగా కొండ దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన మల్లేశ్వరస్వామి (పాతశివాలయం), అర్జునుడు ప్రతిష్ట చేసిన విజయేశ్వరస్వామి దేవస్థానాలు ఉన్నాయి. అలాగే 1200 సంవత్సరాల క్రితం కొలువైన వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కూడా పాతబస్తీలో కొలువై ఉంది. వాటితో పాటుగా స్వాతంత్య్రం రాక ముందే బ్రిటీష్‌ పాలకుల కాలంలో ఏర్పడిన ఆర్సీఎం, సీఎస్‌ఐ, తెలుగు బాప్టిస్ట్‌ సెంటినరీ చర్చిలు ఉన్నాయి.   500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మసీదులు,120 ఏళ్ల క్రితమే ఇక్కడ జైన ఆలయం కొలువై ఉన్నాయి.

మినీ భారత్‌
పశ్చిమ నియోజకవర్గం మినీ భారతదేశంగా పలువురు పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం మనకు దర్శనమిస్తారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం అధిక సంఖ్యలో ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితమే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలతో మమేకమై జీవిస్తున్నారు. అన్ని మతాలకు చెందిన ఆలయాలు ఈ ఒక్క నియోజకవర్గంలోనే మనకు        దర్శనమిస్తాయి. 

టీడీపీ గెలిచింది ఒక్కసారే
పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ గెలిచింది ఒకసారి మాత్రమే. అది కూడా ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సమయంలో ఆయన గాలిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్, సీపీఐల మధ్యనే ఎక్కువ పోటీ కొనసాగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు సార్లు, సీపీఐ ఐదుసార్లు గెలిచింది. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ టీడీపీ, పీఆర్పీ,   ఒక్కొక్కసారి  గెలిచారు. 

పశ్చిమ నియోజకవర్గం జనాభా : 4,25,002
మొత్తం ఓటర్లు : 2,16,711
పురుషులు : 1,07,563
మహిళలు : 1,09,129
ఇతరులు : 19

మరిన్ని వార్తలు