విజ్ఞుల మాట..వినుకొండ

24 Mar, 2019 12:59 IST|Sakshi

సాక్షి, వినుకొండ : అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచిన స్థలం విన్నకొండ కాలక్రమంలో వినుకొండగా పేరుగాంచింది. వినుకొండలో అనేక మంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు నడయాడారు. బ్రిటీష్‌ పాలకుల కాలంలో నిర్మించిన భవనాల్లోనే నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే ఆధ్మాత్మికం ప్రాంతంగా కూడా పేరు ప్రఖ్యాతులు గాంచింది. వినుకొండ కొండపైన వెలసిన రామలింగేశ్వరుని దేవాలయం శ్రీరాముని కాలంలో ప్రతిష్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణంలోని గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పాతశివాలయం, కమఠేశ్వరాలయం, గమిడి ఆంజనేయస్వామి దేవాలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.

విశ్వనరుడు గళమెత్తిన కొండ..
ప్రపంచంలో ఏమూల కవుల ప్రస్తావన వచ్చినా గుర్రం జాషువా పేరు వినపడగానే వినుకొండ గుర్తుకు రావటం సహజం. గుర్రం జాషువా వినుకొండ పక్కనే ఉన్న చాటగడ్డపాడులో జన్మించారు. సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనంపై ఉద్యమించి కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటిసీను పద్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. అంతటి ఘన చరిత్ర కలిగిన గుర్రం జాషువా ఈ ప్రాంత నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం విశేషం.

నల్లమలను ఆనుకుని.. 
నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం నల్లమల అడవిని ఆనుకుని ఉంది. ఇది జిల్లాలోనే చాలా వెనుకబడిన మండలం. ఇక్కడ దాదాపు 50కిపైగా సుగాలి తండాలున్నాయి. తాగునీరు, సాగునీరు సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్ల తరబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మించాలని గతంలో ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎక్కువగా వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు ఉండటంతో ఈ మండలం అభివృద్ధికి నోచుకోలేదు. 

నక్సల్స్‌ ప్రాబల్యం..
గతంలో బొల్లాపల్లి మండలంలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి గ్రామాల్లో అధికారులు సైతం పనిచేసేందుకు వెనుకంజ వేసేవారు. ప్రస్తుతం నక్సల్స్‌ ఆనవాళ్లు లేనప్పటికీ అభివృద్ధి మాత్రం జరగలేదు. బండ్లమోటు గ్రామంలో హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ మైనింగ్‌ ఉంది. ప్రస్తుతం అది కాస్తా మూతపడటంతో అక్కడ ఉద్యోగులు వలస వెళ్లిపోయారు. నేడు ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు లేకపోవటంతో ఉపాధి కరువైంది.

ఎవరినైనా ఆదరించే తత్వం..
వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కరూ రెండుసార్లకు మించి గెలిచిన దాఖలాలు లేవు. అలాగని సామాన్య రాజకీయ చరిత్ర ఉన్న వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుంది. ఇక్కడ గ్రామస్థాయి నుంచి లీడర్‌గా ఎదిగిన మక్కెన మల్లికార్జునరావు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారే.

వైద్య వృత్తిలో ఉన్న వీరపనేని యల్లమందరావు కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానికేతర అభ్యర్థులైన భవనం జయప్రద, నన్నపనేని రాజకుమారిలను కూడా గెలిపించి గౌరవించారు. వినుకొండ నియోజకవర్గంలో 1972 భవనం జయప్రద మంత్రిగా ఒకటిన్నరేళ్లు పని చేశారు. తర్వాత కాలంలో నన్నపనేని రాజకుమారి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా క్యాబినెట్‌ హోదాలో కొనసాగారు.

లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు..
నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఇందులో 50 శాతం సుబాబుల్, జామాయిల్‌ సాగు చేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో మిరప, పొగాకు, కంది, వరి ప్ర«ధానమైన పంటలుగా సాగవుతున్నాయి. ఈ ప్రాంతంలో పాల పరిశ్రమపై ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. వినుకొండ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే తూర్పున గొర్రెపాడు వద్దనున్న సంగం, నరసరావుపేట సమీపంలో ఉన్న సంతమాగులూరు, పడమర ఉమ్మడివరం, దక్షిణం కెల్లంపల్లి గ్రామాలు ప్రకాశంజిల్లా సరిహద్దుల్లో ఉంది.  

గ్రామ పంచాయతీలు : 105
జనాభా  : 3,08,145
ఓటర్లు : 2,33,297  
పురుషులు : 1,16,306 
స్త్రీలు  : 1,16,971     
పెరిగిన  ఓటర్లు : 36,352
పోలింగ్‌ బూత్‌ల సంఖ్య : 299 

కమ్యూనిటీ వారీగా ఓటర్లు
కమ్మ    : 45,000 
రెడ్డి    : 19,000 
కాపు    : 22,000
ఆర్యవైశ్యులు : 16,000
ముస్లింలు  : 18,000
బీసీలు  : 62,000
ఎస్సీలు : 40,000
ఎస్టీలు  : 35,000
ఇతరులు : 6,000  

మరిన్ని వార్తలు