ఎన్నికల బదిలీలకు వేళాయె...

30 Jan, 2014 01:24 IST|Sakshi
ఎన్నికల బదిలీలకు వేళాయె...
  • ఒకేచోట మూడేళ్లు నిండినవారికి కదలికలు తప్పవు
  •  సొంత జిల్లా వారికీ స్థానచలనం
  •  35 మంది తహశీల్దార్లు, 47 మంది ఎంపీడీవోలకు కదలిక
  •  ఏడుగురు సీఐలు, నలుగురు ఎస్సైలకు బదిలీలు
  •  ఫిబ్రవరి 10 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత
  •  జిల్లా యంత్రాంగం కసరత్తు
  •  
    సాక్షి,  మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. ఎన్నికల్లో పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ప్రమేయం ఉండే ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 10 వరకు ఎత్తివేశారు. ఈసారి మూడేళ్లు నిండిన ఉద్యోగులు, సొంత జిల్లాకు చెందినవారిని బదిలీ చేయనున్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి బదిలీ వేటు తప్పదు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల వారీగా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సొంత జిల్లాల్లో నాలుగేళ్లుగా పనిచేస్తూ ఒకేచోట మూడేళ్లు సీటు వదలని వారిని బదిలీ చేయనున్నారు.

    2014 మే నెలాఖరుకు మూడేళ్ల సర్వీసును ఒకేచోట పూర్తిచేసినవారు కూడా బదిలీకి అర్హులే. జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డెప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవో తదితరులతో పాటు ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి బదిలీల నిబంధన వర్తిస్తుంది. బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఆయా అధికారులు తక్షణం విధుల్లో చేరాల్సి ఉంది.

    ఈ బదిలీల సమయంలో వారికి సెలవులు అనుమతించరు. ఆరు నెలల్లో పదవీ విరమణ చేసేవారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎన్నికల కసరత్తులో భాగం గా ఫిబ్రవరి పది నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్ రఘునందన్‌రావుకు సూచించారు.
     
    జిల్లాలో వీరు కదలాల్సిందే..
     
    ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో శాఖల వారీగా బదిలీకి అర్హులైనవారి జాబితాలు తయారు చేస్తున్నారు. జిల్లాలో కీలక అధికారులు ఇటీవలే రావడంతో ఎక్కువమంది తహశీల్దార్‌లు, ఎంపీడీవోలపై బదిలీ వేటు పడనుంది. జిల్లాలో 49 మండలాలకు గాను మూడేళ్లు నిండిన, సొంత జిల్లా నిబంధన మేరకు ఎంపీడీవోలు 47 మంది, తహశీల్దార్‌లు 35 మందికి బదిలీ తప్పదు. దీంతో పొరుగు జిల్లాల్లో పదిలమైన చోటుకోసం అప్పుడే వారు వెదుకులాట ప్రారంభించారు.
     
    పోలీస్ శాఖలో కదలికలు తక్కువే..

     
    జిల్లాలోని పోలీస్ శాఖలో ఎన్నికల బదిలీ ప్రభావం కొంతమంది పైనే పడనుంది. పోలీస్ శాఖ ఏలూరు రేంజ్ (కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల) పరిధిలో తరచూ బదిలీలు జరుగుతుండటం, దీనికితోడు ఒక జిల్లాలో పోలీసులను మరో జిల్లాకు బదిలీ చేయడంతో ఈ సారి ఎన్నికల బదిలీ వేటు పడేది చాలా తక్కువ మందిపైనే అని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, డీఎస్పీలు జిల్లాకు వచ్చి మూడేళ్లు పూర్తికాలేదు. కేవలం ఏడుగురు సీఐలు, నలుగురు ఎస్సైలపై మాత్రం బదిలీ వేటు పడనుంది. మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎస్సైలను వారి సబ్ డివిజన్, అసెంబ్లీ నియోజకవర్గాలకు దూరంగా నియమించాల్సి ఉంటుంది.
     

మరిన్ని వార్తలు