ఎన్నికలవరం

27 Feb, 2014 01:07 IST|Sakshi
ఎన్నికలవరం
  •     లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి జరిగితే నష్టమే
  •      ఓటు జారి గల్లంతయ్యేనా..
  •      కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల ఆందోళన
  •      ఎప్పుడైనా సిద్ధమంటున్న వైఎస్సార్ సీపీ
  •  రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉంది. అసలు ఎన్నికల పేరెత్తితేనే ఆ రెండు పార్టీల గుండెలు జారిపోతున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ సంకేతాలు ఇవ్వడంతో మరింత కంగారు  పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు కారణమైన తమపై జిల్లా వాసులు భగ్గుమంటున్నారన్న విషయం ఆ రెండు పార్టీలకు తెలియంది కాదు.
     
    సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే ఘోర పరాభవం తప్పదని కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అందుకే విడివిడిగా ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని, అందుకు అనుగుణంగా అవసరమైతే ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞాపనలు అందించాలని పార్టీ అధిష్టానాలకు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఎలాగు ఆరు నెలలు పడుతుందని కాబట్టి, ఆ తర్వాతే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని రెండు పార్టీలు భావిస్తు న్నాయి. వారి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పడంతో ఆ పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ వర్గాలు కలవరపాటుకు గురయ్యాయి.
     
    టీడీపీలో తిరుగుబాట్లు..
     
    తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేకపోవడంతో నేతలు అయో మయంలో పడ్డారు. లోక్‌సభలో గుండెపోటుకు గురైన బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ముంబై ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ ఎంపీ టికెట్ కోసం రాయ‘బేరాలు’ నడపడం కొనకళ్ల వర్గీయులను కలచివేస్తోంది. దీనికితోడు పెడన నుంచి ఎంపీ కొనకళ్ల, బూరగడ్డ వేదవ్యాస్‌ల్లో ఎవరో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పోటీకి ‘కాగిత’ సిద్ధంగా లేరని కొందరు, ఆయనకు టికెట్ ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని ఇంకొందరు ఎవరి వాదన వారు వినిపించడంతో టీడీపీ ఇరుకున పడింది.

    పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై సైతం పార్టీలోని కేశినేని నాని, వల్లభనేని వంశీ కోపంగా ఉన్నారు. పెనమలూరు, గన్నవరం, నూజివీడు, మైలవరం, పెడన, బందరు, అవనిగడ్డ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయవాడ, బందరు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్ల నడుమ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు మానసికంగా సిద్ధం కాలేకపోతున్నారు.
     
     కాంగ్రెస్‌కు గుడ్‌బై..
    సమైక్యాంధ్ర అంటూ ఆదినుంచీ హంగామా చేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగిపోయాక తీరుబడిగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు.
     
    బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, మంత్రి కొలుసు పార్థసారథి, అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
     
     బూరగడ్డ వేదవ్యాస్ పదవులు దక్కే పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవలే ఆయన కుమారుడు చంద్రబాబును కలిసినట్టు సమాచారం.
     
     జనంలోకి వైఎస్సార్ సీపీ..
     తొలి నుంచి సమైక్య నినాదంతో ముందుకుసాగిన వైఎస్సార్ సీపీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
     
     ఆ పార్టీ జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముందుగానే సమన్వయకర్తలను ప్రకటించింది.
     
      పార్టీశ్రేణులు ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాయి.
     
     పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగరాధ్యక్షుడు జలీల్‌ఖాన్ నేతృత్వంలో జిల్లాలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి.
     
      కొద్ది రోజులుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఆ పార్టీ సమన్వయకర్తలు ‘గడపగడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు.
     

>
మరిన్ని వార్తలు