ఆగమాగం

8 Mar, 2014 04:10 IST|Sakshi

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల జాతర మొదలైంది. ఒకేసారి వచ్చిన పురపాలక... సాధారణ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న నేతలకు పులిమీద పుట్రలా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఖాయంగా వెలువడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు మొట్టికాయతో అప్పుడే అధికారులు ఎన్నికల ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు కూడా. సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయా... అని ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూసిన నాయకులకు ఈ ఎన్నికలు ఇప్పుడెందుకొచ్చాయా అంటూ డీలాపడే పరిస్థితి తలెత్తింది. సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మున్సిపల్ ఎన్నికల గండం ఎలా దాటాలో తెలియక తలలుపట్టుకుంటున్న పార్టీలు, నాయకులు జెడ్పీ ఎన్నికలు కూడా వస్తుండడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
 
 ఒక ఎన్నికల ప్రక్రియలో మరో ఎన్నిక, ఆ ఎన్నిక ప్రక్రియ సాగుతుండగానే ఇంకో ఎన్నిక రావడం అసాధారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు కీలక ఎన్నికలు ఒకేసారి వస్తుండడంతో పలు రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఒకరి ఎన్నికకు మరొకరు సహకరించుకోవడం కాదు కదా, కనీసం ఎన్నికను, ప్రచారాన్ని... అభ్యర్థులు ఎవరని తెలుసుకొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
 
 జెడ్పీ ఎన్నికలు కూడా వస్తే కేవలం పదిహేను రోజుల తేడాలో మూడు ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశం ఉండడంతో, ఓటర్లు కూడా తికమకపడనున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఏదో ఒక ఎన్నికకే వచ్చేట్లు ఉన్నారని, ఆశావహులు ఇప్పటినుంచే ఆందోళనలో ఉన్నారు. మూడు ఎన్నికలు ఒకేసారి రావడంతో... ఏ పార్టీతో పొత్తు ఉంటుంది... ఏ పార్టీతో అవగాహన ఉంటుంది.... మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా... జెడ్పీ ఎన్నికలకే పరిమితమవుతుందా...? సాధారణ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా... ? తెలియని గందరగోళంలో రాజకీయ ముఖచిత్రం ఉంది.
 
 నేడు ఎంపీపీ
 రిజర్వేషన్లు ఖరారు
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు ఎంపీపీ రిజర్వేషన్లపై దృష్టి సారించారు. జెడ్పీటీసీ రిజర్వేషన్లు గురువారం, ఎంపీటీసీ రిజర్వేషన్లు శుక్రవారం అధికారికంగా గెజిట్ రూపంలో ప్రకటించారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఎంపీపీ రిజర్వేషన్ల వైపు అధికారులు కన్నెత్తిచూడలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానుండడంతో ఆగమేఘాల మీద ఎంపీపీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టారు. శనివారం ఎంపీపీ రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు