కోడ్.. డోన్‌‌ట కేర్

5 Mar, 2014 00:37 IST|Sakshi

 వెవ్వెవ్వే...
 అనధికారికంగా బోడసకుర్రు వంతెన ప్రజలకు అంకితం
 పరోక్షంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఎంపీ హర్షకుమార్
 పాల్గొన్న రుద్రరాజు పద్మరాజు
 ప్రారంభోత్సవ స్వాగతం పేరుతో ఫ్లెక్సీలు
 అధికారుల అయోమయం
 పాశర్లపూడి-బోడసకుర్రు వంతెనపై నడిచి వెళుతున్న ఎంపీ హర్షకుమార్
 
 ఎన్నికల కోడ్‌ను తూనాబొడ్డు అని ఎలా వెక్కిరించవచ్చో మన ఎంపీ హర్షకుమార్ ప్రాక్టికల్‌గా నిరూపించారు. బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ గోదావరి పాయపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలేజీ కొట్టేయాలని భావించిన ఆయనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడితే తననకున్న రాజకీయ లక్ష్యాన్ని సాధించలేనని భావించిన ఆయన తన బుర్రకు పదును పెట్టారు. పత్రికలకు ప్రకటనలొచ్చేశాయ్... ఫ్లెక్సీలు వెలిశాయ్... మీడియాను పిలిచారు... జనాన్ని పోగేశారు... వారితో వంతెనకు ఇటు నుంచి అటు నడిచి ఇక రాకపోకలు సాగించుకోవచ్చని సెలవిచ్చారు. మొత్తమ్మీద కోడ్‌కు చిక్కకుండా, అధికారులకు దొరక్కుండా మీడియా సాక్షిగా వంతెనను ప్రారంభించి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
 
 అమలాపురం, న్యూస్‌లైన్ :
 పదేళ్లుగా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ పరోక్షంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ గోదావరి పాయపై నిర్మించిన వంతెనను మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అనధికారికంగా ఆరంభించారు. ఎన్నికల కమిషన్‌కు దొరకకుండా వంతెనను అనధికారికంగా ఆరంభించి దుస్సంప్రదాయానికి తెర తీశారు. శాసనమండలి  విప్ రుద్రరాజు పద్మరాజు, అధిక సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను వెంటబెట్టుకుని వంతెనపై నుంచి ఎంపీ నడచివచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రారంభోత్సవం నిలుపు చేయాలని జిల్లా అధికారులు చెప్పినా పట్టించుకోని హర్షకుమార్ తాను అనుకున్నదే చేస్తానని మరోసారి నిరూపించారు.
 
 కళ్లుగప్పి వ్యూహాత్మకంగా...
 ఆరు నూరైనా ప్రారంభిస్తానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వంతెన ప్రారంభోత్సవ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రారంభోత్సవాన్ని నిలుపు చేస్తున్నామని, తాను వంతెన పనులు పరిశీలించేందుకు వెళుతున్నానని మీడియాకు సమాచారం అందించారు. ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించకుండా, కొబ్బరికాయ కొట్టకుండా జాగ్రత్తపడ్డ ఆయన, మిగిలిన కార్యక్రమమంతా ప్రారంభోత్సవాన్ని తలపించేటట్టు చేశారు.
 
  వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్న హర్షకుమార్‌కు స్వాగతం అంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వంతెనపైకి చేరుకోగానే ‘వంతెన ప్రారంభించిన ఎంపీ హర్షకుమార్ జిందాబాద్’ అంటూ అభిమానులు నినాదాలు  చేశారు. తొలుత బోడసకుర్రు చేరుకున్న ఆయన వంతెనపై నుంచి వెళ్లే అవకాశమున్నా పడవపై పాశర్లపూడి వైపు చేరుకున్నారు. శిలాఫలకం నిర్మించిన ప్రాంతం నుంచి కాలినడకన వంతెనపైకి చేరుకున్నారు. అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైజై నినాదాల మధ్య హర్షకుమార్ కొత్త వంతెనపై నడక సాగించారు. అక్కడ నుంచి వంతెనపై బోడసకుర్రు వరకూ నడుచుకుంటూ వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంతెనను అధికారికంగా ప్రారంభించాలనుకున్నా ఎన్నికల కోడ్ వల్ల కుదరలేదని, అయితే తనతోపాటు ప్రజలు నడిచి రావడంతో రాకపోకలు ఆరంభమవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఎన్నికల కోడ్‌కు భయపడి పి.గన్నవరం తాజామాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవీ పాశర్లపూడి వద్ద ఎంపీకి స్వాగతం పలికి వెళ్లిపోయారు.
 
 కలెక్టర్ ఆగ్రహం
 వంతెన ప్రారంభోత్సవ సన్నాహాలు చేయడంపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వంతెన ఫొటో, కేంద్రమంత్రుల ఫొటోలతో ‘వైనతేయ వారధి ప్రజలకు అంకిత’మంటూ వచ్చిన ప్రకటనలతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వంతెన ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు చేయడం, సభకు టెంట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై డివిజన్ స్థాయి అధికారులపై మండిపడ్డారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు. ఫ్లెక్సీలు తొలగించి శిలాఫలకం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడ్ ఉల్లంఘనకు దొరక్కుండా వంతెన అనధికారికంగా ప్రారంభమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 జేఏసీ నిరసన
 వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ వస్తే అడ్డుకోవాలని వెళ్లిన కోనసీమ జేఏసీ నాయకులు ఆయన రాకపోయినా నల్లజెండాలతో వంతెన వద్ద నిరసన తెలిపారు. అమలాపురం నుంచి ప్రదర్శనగా వెళ్లిన వారు వంతెన వద్ద హర్షకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి సర్వే దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘తెలంగాణ  నేతలతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారకుడైన ఎంపీ హర్షకుమార్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు, ప్రతినిధులు మంత్రిప్రగడ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 
 బోడసకుర్రు వంతెన మరో చించినాడేనా!
 బోసకుర్రు వంతెన మరో దిండి-చించినాడ వంతెన కానుందా అంటే అవునంటున్నారు కోనసీమ వాసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హర్షకుమార్ ఈ వంతెనను అనధికారికంగా ఆరంభించారు. దీంతో వంతెనపై రాకపోకలు మొదలయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. రేపోమాపో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వంతెనను అధికారికంగా ప్రారంభించాలంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే మే నెలలోగానీ జరిగే అవకాశంలేదు. అప్పటికే వంతెనపై పూర్తిస్థాయిలో రాకపోకలు జరిగి పాతబడే అవకాశం ఉన్నందున కొత్త ప్రభుత్వం దీనిని ప్రారంభించేందుకు పెద్దగా మక్కువ చూపదు.
 
 తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య గతంలో నిర్మించిన దిండి-చించినాడ వంతెన సైతం ఇలా అధికారికంగా ప్రారంభోత్సవానికి నోచుకోకుండా పోయింది. అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి ఈ వంతెనను రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని భావించారు. ఇంతలోనే బాలయోగి మృతి చెందారు. దీంతో ప్రారంభోత్సవం జరగకుండానే వంతెనపై రాకపోకలు ఆరంభమయ్యాయి. ఇప్పుడు బోడసకుర్రు వంతెన పరిస్థితి అలాగే ఉంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు