పద్మవ్యూహం

8 Feb, 2014 03:51 IST|Sakshi

 కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికలకు పోలీసు శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహం రచిస్తోంది. నెలాఖరు లోగా జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా మావోయిస్టుల వివరాలు మొదలు.. సెల్ టవర్ల సంఖ్య వరకు లోతైన సమాచారం సేకరిస్తోంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి కింది స్థాయి అధికారులు, పోలీసులను సర్వసన్నద్ధం చేస్తున్నారు.

 ఎన్నికల సమయంలో హడావుడి కన్నా.. ఇప్పటి నుంచే లోపాలను గుర్తిస్తే అప్పుడు విధి నిర్వహణ సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పక్కాగా లేకపోవడంతో గత ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణల సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో చేరవేయలేకపోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాలపైనా కన్నేసి ఉంచాలనే ఉద్దేశంతో సెల్ టవర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత ఏ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందో దానికి సంబంధించిన సిమ్ కార్డులను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
 
 జిల్లాకు సంబంధించిన సమాచారం కొంత ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో కొంత కాలంగా నక్సల్స్ కదలికలు లేకపోయినా.. అనుమానంతో పోలీసులు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన నల్లమల అటవీ ప్రాంతంలోని వడ్లరామాపురం, వేంపెంట, వెంకటాపురం, ఇందిరేశ్వరం, నల్లకాలువ, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, జానాలగూడెం, ఎర్రమఠం, ముసలమడుగు, లింగాపురం ప్రాంతాలపై నిఘా కట్టుదిట్టం చేశారు.
 
 పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాల ఏర్పాటుపై దృష్టి
 రాష్ట్ర విభజన ప్రయత్నాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం దృష్టి సారించింది. శాంతి భద్రతలకు సంబంధించి జిల్లాల వారీగా నివేదిక కోరింది. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన సీఐ, ఎస్‌ఐలను బదిలీ చేయాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది.
 
 కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే సమాచారం నేపథ్యంలో పోలీసు శాఖ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యేక అంశం నిఘా కెమెరాల ఏర్పాటు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమాచార సేకరణలో పోలీసుల శాఖ తలమునకలవుతోంది.
 

మరిన్ని వార్తలు