నారీమణులు.. రాజకీయ దివ్వెలు

30 Mar, 2019 10:13 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : ఎన్నికల సంగ్రామంలో జిల్లాకు చెందిన మహిళలు నారీశక్తిని చాటిచెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో 1981 ఉప ఎన్నికల్లో పరకాల కాళికాంబ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సా«ధించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో ఆచంట రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి మోచర్ల జోహార్‌వతి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం పొందారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పీతల సుజాత పోటీచేసి విజయం పొందారు. 

భీమవరం నుంచి 1995లో భూపతిరాజు కస్తూరి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఉండి నుంచి 1970 ఉప ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థిగా కె.ఆండాళ్లమ్మ పోటీ చేసి విజయం సాధించారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 1983,1985లో టీడీపీ తరఫున ప్రత్తి మణెమ్మ పోటీచేసి విజయం పొందారు. అత్తిలి నియోజకవర్గం నుంచి 1955లో చోడగం అమ్మనరాజా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి విజయబావుటా ఎగురవేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన డాక్టర్‌ కోసూరి కనకలక్ష్మి ఓడిపోయారు.

1983 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఈలి వరలక్ష్మి విజయం పొందగా, 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె తిరిగి 1987 ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగా, 1989లో పోటీ చేసి పరాజయం చెందారు. దెందులూరు నుంచి 1985లో కాంగ్రెస్‌ తరçఫున ఎం.పద్మావతి పోటీ చేసి ఓటమి చెందారు. 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మాగంటి వరలక్ష్మీదేవి విజయం పొందారు. ఏలూరు నుంచి 1994లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమెకు పరాజయం ఎదురైంది.

గోపాలపురం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐ తరఫున పోటీ చేసి దాసరి సరోజనిదేవి గెలుపొందారు. 1983లో తిరిగి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన నంబూరి ఝాన్సీరాణి విజయం సాధించలేదు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మద్దాల సునీత ఓటమిపాలై.. 2004లో విజయం సాధించారు. 2009లో తానేటి వనిత టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత చింతలపూడిలో గెలుపొందారు. 

మరిన్ని వార్తలు