గుంటూరులో ఎలక్ట్రిక్‌ ఆటోలు

2 Dec, 2018 08:23 IST|Sakshi

నాలుగున్నర గంటల చార్జింగ్‌తో 100 కి.మి ప్రయాణం

తొలి ఈ–ఆటో రిజిస్ట్రేషన్‌ చేయించిన సంగడిగుంట వాసీ

రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు  

నగరంపాలెం(గుంటూరు): నగర రహదారిపై విద్యుత్‌తో చార్జింగ్‌ చేసి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్‌ (ఈ ఆటో రిక్షా) ఆటోల పరుగు ప్రారంభమైంది. నగరంలో ఆటోల వలన ఉత్పత్తి అవుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జిల్లా రవాణా శాఖ ఇప్పటికే గ్రీన్‌ పాలసీ అమలుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నగర పరిధిలో డీజీల్, పెట్రోల్‌తో నడిచే ఆటోలు 20,000 వరకు తిరుగుతున్నాయి. ఒక లీటరు డీజిల్‌ వినియోగంలో కాలుష్యానికి కారకమైన 2.5 కేజీ కార్బన్, 60 గ్రాముల నైట్రోజన్‌ వెలువడి గాలిలో కలుస్తుంది. ప్రతి ఏటా ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలు సైతం 50శాతం పైనే పెరుగుతున్నాయి. వీటి వినియోగం ఎక్కువ అవటంతో కాలుష్యం నాలుగురెట్లు అధికమవుతోంది. వాహన కాలుష్యరహిత జిల్లాగా మార్చటంలో భాగంగా తొలి దశలో నగరంలో రవాణాకు సంబంధించి ఎలక్ట్రికల్‌ ఆటోలను మాత్రమే అనుమతించేలా రవాణాశాఖ రూపొందించిన గ్రీన్‌ పాలసీకి జిలా కలెక్టర్‌ కోన శశిధర్‌ సైతం ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం రవాణాశాఖ నగర పరిధిలో డీజీల్, పెట్రోలు ఆటోలకు ఎటువంటి అనుమతులు మంజూరు చేయదు.

డీజిల్, పెట్రోల్‌ ఆటోల నిషేధం..
 ప్రస్తుతం ఉన్న ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. నగరపరిధిలో 2019 డిసెంబరు 31 తరువాత పెట్రోలు, డీజిల్‌తో నడిచే ఆటోలను పూర్తిగా నిషేధిస్తారు. 2020 జనవరి మొదటి తేదీ నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ ఆటోలను మాత్రమే నగర రహదారుల్లో తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదే విధంగా వివిధ సంక్షేమ శాఖల సబ్సిడీ రుణాలు సైతం ఎలక్ట్రిక్‌ ఆటోలకు కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇస్తాయి. గ్రీన్‌పాలసీ నోటిఫికేషన్‌ అమల్లోకి రావటంతో ఎలక్ట్రిక్‌ ఆటోలు ఉత్పత్తి చేసే కంపెనీలు నగరంలో షోరూంలు ఏర్పాటు చేయటం ప్రారంభించారు. ఇప్పటికే ఆటోనగర్‌లో, స్వర్ణభారతినగర్‌ లోని ఆర్టీవో కార్యాలయం, రెండు షోరూంలో ఏర్పాటు చేశారు. మరో కంపెనీ ఆటోల తయారీ చేసే  కేంద్రాన్ని సైతం నగరంలోనే ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ ఆటోల ధరలు మోడల్స్‌ను బట్టీ రూ.1.50 లక్షల నుంచి రూ.2.10 లక్షల వరకు ఉన్నాయి.

నగర పరిధిలో పది చార్జింగ్‌ స్టేషన్లు..
  ఎలక్ట్రిక్‌ ఆటోలో ఉన్న బ్యాటరీలను విద్యుత్‌తో నాలుగున్నర గంటలు చార్జింగ్‌ చేస్తే 100 కిమీ వరకు ప్రయాణించే అవకాశం ఉంది. బ్యాటరీలు నిల్వ ఉన్న విద్యుత్‌ ద్వారా డీసీ మోటరును పనిచేయించటం వలన ఆటో ముందుకు కదులుతుంది. ఎలక్ట్రిక్‌ ఆటోకు గేర్‌ సిస్టంతో కాకుండా కేవలం ఆటో స్టార్ట్‌ యాక్సిలేటర్‌ రేజింగ్‌ ద్వారానే కదలిక ఉంటుంది. డీసీ మోటరు కావటంతో ఎటువంటి శబ్దం లేకుండా, పొగ రాకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ ఆటోలను తయారీ దారులు డిజిటల్‌ మీటర్లు, రిమోట్‌ స్టార్టింగ్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిజిటల్‌ మీటర్‌లో సెల్‌ఫోన్‌ బ్యాటరీ తరహా ఉండే చిహ్నాం ద్వారా బ్యాటరీ స్థితిని రియల్‌ టైంలో  పర్యవేక్షించే అవకాశం ఉంది. బ్యాటరీ డౌన్‌ అవుతున్న విధానంను మానిటర్‌లో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది.  ఎలక్ట్రిక్‌ ఆటోలకు ప్రస్తుతం ఇంటిలోని ఏసీ విద్యుత్‌ ద్వారా చార్జింగ్‌ చేసుకునే వీలు ఉంది. త్వరలో నగరం పరిధిలో ప్రధాన రహదారులపై పది చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. చార్జింగ్‌ స్టేషన్‌లో డీసీ విద్యుత్‌ ద్వారా చార్జింగ్‌ చేయటం వలన 60శాతం పైనే సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. 

తొలి ఆటో రిజిస్ట్రేషన్‌ 
చేయించిన సంగడిగుంట వాసీ జిల్లా రవాణాశాఖ పరిధిలో తొలి ప్యాసింజర్‌ ఈ రిక్షా(ఎలక్ట్రిక్‌ ఆటో)ను సంగడిగుంటకు చెందిన శంకరరావు రామభద్రరావు గుంటూరు ఆర్‌టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆటోను నడుపుతున్న డ్రైవర్‌ అంకమ్మరావు మాట్లాడుతూ ఈ ఆటో రిక్షా పనితీరు సంతృప్తిగా ఉందన్నారు. నలుగురు నుంచి ఆరుగురు వరకు ఎక్కిన ఓవర్‌బ్రిడ్జ్‌ సైతం అవలీలగా ఎక్కుతుందన్నారు. నగరానికి అనుగుణంగా గరిష్టంగా 40కిమీ స్పీడ్‌తో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ప్రయాణిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు