కాలితే కాసులే!

9 Dec, 2013 00:23 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి:  ట్రాన్స్‌ఫార్మర్ కాలితే విద్యుత్ అధికారులు, సిబ్బందికి కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలో 8,97,188 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 5,96,148 గృహ, 59,153 వాణిజ్య, 8,057 పారిశ్రామిక, 2,20,246 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. నెలకు జిల్లాలో సగటున 225 మి లియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుండగా, అందులో వ్యవసాయ అవసరాలకే 170 మిలియన్
 యూనిట్లు ఖర్చవుతున్నాయి. ప్రతి ఏటా రబీ సాగు ఊపందుకున్న తర్వాత విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఓవర్ లోడ్ భారాన్ని తట్టుకోలేక ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతుంటాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 4,500 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం దీనికి నిదర్శనం. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో వేరే ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ట్రాన్స్‌కో అధికారులు అడుగడుగునా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుల సేవల నియమావళి ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే.. పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల వ్యవధిలో మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. ట్రాన్స్‌ఫార్మర్ల లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా బాధ్యత విద్యుత్ శాఖదే. కానీ, క్షేత్రస్థాయిలో ఏఈలు, లైన్‌మెన్‌లు ఈ భారాన్ని రైతుల నెత్తిపై వేసేస్తున్నారు. ఫిర్యాదు అందిన వారం పది రోజులకు గాని అధికారులు కదలడం లేదు. రైతులు విద్యుత్ శాఖ కార్యాలయాలు చుట్టూ తిరిగి అధికారుల చేతులు తడిపి అనుమతులు పొందాల్సి వస్తోంది.  

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 14 ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలున్నాయి. నిర్వహణ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వ వాహనంలోనే పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మను మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి నుంచి బాగు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ సిబ్బంది తీసుకు రావాల్సి ఉండగా.. ఆ పని సైతం రైతులతోనే చేయిస్తున్నారు. రైతులే సొంత ఖర్చుతో వాహనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇక మరమ్మతు, లోడింగ్, అన్‌లోడింగ్.. ఇలా ఒక్కో పనికి కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు.  
 ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం
 జిల్లాలో 12,825 సింగిల్ ఫేజ్, 32,271 త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు కలిపి మొత్తం 45,096 ఉన్నాయి.  ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన చోట తక్షణమే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు అదనంగా 4 శాతం ట్రాన్స్‌ఫార్మర్లు రోలింగ్ స్టాక్‌గా ఉండాలి. ఈ లెక్కన 513 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు రోలింగ్ స్టాక్‌గా ఉండాల్సి ఉండగా 569 ఉన్నాయి. అయితే, 1804 త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాకు స్థానంలో 1760 మాత్రమే ఉన్నాయి. దీంతో కొన్నిసార్లు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌నే మరమ్మతు కేంద్రానికి తరలించి .. మరమ్మతులు జరిగిన తర్వాత వెనక్కి తీసుకు రావాల్సి వస్తోంది.
 తలా నాలుగొందలు వేసుకున్నాం:
 ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి ఐదు రోజులయ్యింది. అప్పుడే ఫిర్యాదు చేశాం. దీని కింద 50 పొలాలకు కనెక్షన్లున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ రవాణా, ఇతర ఖర్చుల కోసం తలా నాలుగొందలు చందా వేసుకున్నాం. మరమ్మతు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్లడానికి నలుగురు రైతులం వచ్చాం.
 - ఎన్.మల్లేషం,  రైతు, మద్దికుంట, సదాశివపేట

మరిన్ని వార్తలు