విద్యుదాఘాతంతో కానిస్టేబుల్‌ దుర్మరణం

13 Jul, 2018 08:18 IST|Sakshi
అపస్మారక స్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను పక్కకు లాగుతున్న సీఐ, కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్‌ మృతికి కారణమైన గేట్‌ ఇదే,  (ఇన్‌సెట్‌) బి.వెంకట చైతన్య(ఫైల్‌ఫొటో)

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: విద్యుదాఘాతం ఓ కానిస్టేబుల్‌ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమ కళ్లెదుటే సాటి కానిస్టేబుల్‌ గిలగిలా కొట్టుకుంటుంటే అక్కడున్న సిబ్బంది బతికించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణం గంగమ్మ దేవాలయం వీధికి చెందిన నారాయణ, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు బి. వెంకటచైతన్య(29) 2013లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.  ఏడాది పాటు శిక్షణ పొందిన తర్వాత 2014లో మొదటి పోస్టింగ్‌ మైలవరం మండలం  తలమంచిపట్నం పోలీసు స్టేషన్‌లో ఇచ్చారు. ఇతను బీటెక్‌ పూర్తి చేశాడు.

కంప్యూటర్‌పై  పరిజ్ఞానం ఉండటంతో ఇటీవల పోలీసు అధికారులు ఇతన్ని జమ్మలమడుగు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు ముగించుకున్నాడు. ఇంటికి బయలుదేరాలనుకున్న సమయంలో వర్షం మొదలు కావడంతో అక్కడే ఆగిపోయాడు. వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చాడు. స్టేషన్‌ ప్రధాన గేటు వద్ద నీరు నిల్వ ఉండటంతో ఆ నీళ్లలో నుంచి దాటుకునే క్రమంలో అతను గేటును పట్టుకున్నాడు.  అక్కడున్న ఎర్త్‌ వైర్‌ ద్వారా ఆ గేటుకు విద్యుత్‌ సరఫరా అవుతుండంతో విద్యుత్‌ షాక్‌ తగిలి ఒక్కసారిగా గేటుకు అతుక్కుపోయి గిలగిలా కొట్టుకుంటున్నాడు. గమనించిన సహచర కానిస్టేబుళ్లు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అర్బన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి కాలితో గట్టిగా తన్నడంతో అతను గేటు నుంచి విడిపోయి దూరంగా పడిపోయాడు.

బతికించేందుకు విశ్వ ప్రయత్నం..
విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్న కానిస్టేబుల్‌ వెంకట చైతన్యను బతికించేందుకు సహచర సిబ్బంది విశ్వ ప్రయత్నం చేశారు. అతని నోటిలో నోరు పెట్టి బలంగా గాలి ఊదుతూ శ్వాస తీసుకునేలా చేయాలని చూశారు. అప్పటికే తీవ్ర విద్యుదాఘాతానికి గురి కావడంతో శ్వాస తీసుకునే స్థితిలో కూడా అతను లేకుండా పోయాడు. దీంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే తుది శ్వాస విడిచాడు.

అందరూ చూస్తుండగానే సాటి కానిస్టేబుల్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో పోలీసు సిబ్బంది దుఃఖ సాగరంలో మునిగిపోయారు. డీఎస్పీ కోలా కృష్ణన్, సీఐలు ప్రవీణ్‌కుమార్, ఉమామహేశ్వరరెడ్డితో పాటు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలు కానిస్టేబుల్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు కన్ను మూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు