20 రోజుల్లో ఈ–కార్ల పరుగులు!

30 Aug, 2018 06:30 IST|Sakshi

తొలిదశలో ఈపీడీసీఎల్‌కు 67, జీవీఎంసీకి 30.. 

ఇప్పటికే డీలర్ల వద్ద 30 కార్లు సిద్ధం 

అందుబాటులోకి చార్జింగ్‌ స్టేషన్లు 

సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ–కార్లు పరుగులు తీయనున్నాయి. మరో 20 రోజుల్లో ఇవి రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున అద్దె కార్లను వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్‌ కార్ల (ఈ– కార్ల)ను ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ యోచన. ఈ ఎలక్ట్రిక్‌ కార్లను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సంస్థ సమకూర్చనుంది. విశాఖకు దాదాపు 400 ఎలక్ట్రిక్‌ కార్లు అవసరమవుతాయని అధికారులు ఇదివరకే అంచనా వేశారు. 

తొలిదశలో తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)కు 67, జీవీఎంసీకి 30 వెరసి 97 ఈ–కార్ల కోసం ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నగరంలోని డీలర్ల వద్ద 30 ఈ–కార్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈపీడీసీఎల్‌కు 20, జీవీఎంసీకి 10 కార్లను మరో 20 రోజుల్లోగా డెలివరీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మరో వంద కార్లకు డిమాండ్‌ ఉంది. మలిదశలో వీటిని అందజేస్తారు. 

ఆ తర్వాత దశల వారీ గా ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ–కార్లను సమకూరుస్తారు. టాటా, మహిం ద్రా కంపెనీలు తయారు చేస్తున్న టాటా టిగార్, మహింద్రా ఈ–వెరిటో మోడల్‌ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12–13 లక్షల విలువ చేసే ఈ–కారును ఈఈ ఎస్‌ఎల్‌ కొనుగోలు చేస్తుంది. వీటిని వినియోగిస్తున్న శాఖలు డ్రైవర్‌ను సొంతంగా సమకూర్చుకుని నెలకు ఒక్కో కారుకు రూ.20 వేల చొప్పున ఈఈఎస్‌ఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఈఈఎస్‌ల్‌ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి.

ఈ–కార్ల ప్రత్యేకతలివీ..
ప్రస్తుత మార్కెట్లో ఉన్న టిగార్, వెరిటో మోడళ్లతోనే ఈ–కార్లను రూపొందించారు. ఈ కార్లకు క్లచ్, గేర్లు ఉండవు. న్యూట్రల్, రివర్స్, స్పీడ్‌ (స్పోక్‌) పాయింట్లను మార్చుకుంటే సరిపోతుంది. నడుస్తున్నపుడు బ్యాటరీ కార్ల మాదిరిగా ఏ మాత్రం శబ్దం రాదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వీలుంటుంది. 

చార్జింగ్‌ స్టేషన్లు..
ఈ–కార్లు నడవడానికి చార్జింగ్‌ స్టేషన్లు అవసరం. ఇందుకోసం ఈపీడీసీఎల్‌ 12 ఫాస్ట్‌ చార్జింగ్‌ (డీసీ) స్టేషన్లు, 13 ఏసీ చార్జింగ్‌ పాయింట్లను సిద్ధం చేస్తోంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లను ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసులో 6, మధురవాడ, సర్కిల్, డివిజన్‌ కార్యాలయాల్లోను, కార్పొరేట్‌ కార్యాలయంలో 3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్‌ మూడో వారం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఈపీడీసీఎల్‌ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే కారు 145 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ 90 నిమిషాలు, ఏసీ చార్జింగ్‌ 6 గంటల సమయం తీసుకుంటుంది. దీంతో ఈ ఎలక్ట్రిక్‌ కార్లు నగర పరిధిలో తిరగడానికే ఎక్కువగా ఉపయోగపడనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సమీప పట్టణాల్లో ప్రతి 30, 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిస్కంలు యోచిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు