ప్రజలు అపోహలకు గురి కావద్దు: ఏపీఈపీడీసీఎల్‌

15 May, 2020 18:32 IST|Sakshi

సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్‌ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగానే గత నెల రీడింగ్‌ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్‌ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్‌ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు.

ఒకవేళ కరెంట్‌ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. కాల్‌ సెంటర్‌ 1912కి కాల్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్‌ బిల్లులు చెల్లించడానికి జూన్‌ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్‌ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్‌ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్‌ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్‌ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు.

మరిన్ని వార్తలు