విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు తారుమారు

4 Apr, 2020 04:38 IST|Sakshi

గణనీయంగా తగ్గిపోయిన విద్యుత్‌ వాడకం 

లాక్‌డౌన్‌ కొనసాగితే ఇంకా పడిపోవచ్చు 

పరిస్థితులను సమీక్షిస్తున్న అధికారులు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పడిపోయే వీలుందని విద్యుత్‌ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి నివేదికలపై శుక్రవారం సమీక్షించిన ఉన్నతాధికారులు ఇందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వేసవిలో రోజుకు విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 210 మిలియన్‌ యూనిట్లు ఉండొచ్చని జనవరిలో అంచనా వేశారు. అయితే కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో విద్యుత్‌ వినియోగం అంచనాలన్నీ తారుమారయ్యాయి. వారం రోజులుగా గరిష్ట విద్యుత్‌ వినియోగం రోజుకు 160 మిలియన్‌ యూనిట్లు దాటడం లేదు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి వ్యవసాయ వినియోగం కూడా తగ్గుతుంది. దీంతో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 125 మిలియన్‌ యూనిట్లకు తగ్గే వీలుంది. దీంతో వీలైనంత వరకూ విద్యుత్‌ లభ్యతను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే.. 
► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి కలిపి మొత్తం 185 మిలియన్‌ యూనిట్ల లభ్యత ఉంది. మరో 20 మిలియన్‌ యూనిట్లు మార్కెట్లో చౌకగా లభించే అవకాశం ఉంది.  
► డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తి కంపెనీల న్నింటికీ డిస్కమ్‌లు వేగంగా ఫోర్స్‌మెజర్‌ నోటీసులు ఇస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఫోర్స్‌మెజర్‌ ఉపయోగపడుతుంది.  
లాక్‌డౌన్‌ తీసేస్తే వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్‌ పెరిగే వీలుంది. రాష్ట్రంలో 35 మిలియన్‌ యూనిట్ల వరకూ వ్యవసాయ విద్యుత్‌ వాడకం ఉంది. ఇది తగ్గుతుంది కాబట్టి వాణిజ్య అవసరాలు పెరిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. 

ఫోర్స్‌మెజర్‌ అంటే..? 
ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ విపత్తు నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉండకపోతే... ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయవచ్చు. దీనికి ఒప్పందాలు కుదుర్చుకున్న ఇరు పక్షాలు ఒప్పుకోవాలి. దీన్నే ఫోర్స్‌మెజర్‌ అంటారు. ఫోర్స్‌మెజర్‌ అమలులో ఉంటే గతంలో చేసుకున్న ఒప్పందాలకు వ్యయం చేయాల్సిన అవసరం ఉండదు. 

ఏప్రిల్‌లో డిమాండ్‌ పెరుగుతుందని భావించి అంచాలు సిద్ధం చేసుకున్నాం. కరోనా ప్రభావంతో అవన్నీ తారుమారయ్యాయి. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళ్తున్నాం. ఫోర్స్‌మెజర్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఏకైక మార్గం. దీన్ని వేగంగా అమలు చేస్తున్నాం. మరోవైపు థర్మల్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచాం. ఏ పరిస్థితినైనా తట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం.  
– శ్రీకాంత్‌ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి)

మరిన్ని వార్తలు