విద్యుత్ ఉద్యోగుల విభజన సమంజసమే

17 Jun, 2015 03:22 IST|Sakshi

గవర్నర్‌కు నివేదించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఏపీ విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ఆరోపణలకు సమాధానాలు

 
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగుల సంఘాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. విభజన చట్టానికి లోబడే ఉద్యోగుల విభజనను తెలంగాణ విద్యుత్ సంస్థలు జరిపాయని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఉద్యోగుల విభజన పూర్వపరాలను, తమ వాదనలను తెలియజేశారు. ఏపీ ఉద్యోగ సంఘాలు చేస్తున్న నాలుగు ప్రధానఆరోపణల వెనక వున్న వాస్తవాలను వినతిపత్రం రూపంలో గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్‌ను కలసినవారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్, ముష్టాక్, నాగరాజు, ఆరుద్ర తదితరులున్నారు.
 
 ఏపీ ఆరోపణలు.. టీవిద్యుత్ సమాధానాలు
 ఆరోపణ-1: ఏపీని సంప్రదించకుండానే తెలంగాణ విద్యుత్‌సంస్థ లు ఉద్యోగుల తుది కేటాయింపుల మార్గదర్శకాలను రూపొందించాయి.
 వాస్తవం: విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు, సెక్షన్ 82 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కేటాయింపులకు వర్తిస్తాయి. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సెక్షన్ 77 వర్తింపజేస్తూ ఏపీ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించగా, తెలంగాణ సంస్థలు తిరస్కరించాయి. కమల్‌నాథన్ కమిటీ సైతం ఇదే నిర్ణయా న్ని సమర్థించింది. తప్పనిపరిస్థితిలో తెలంగాణ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించాయి.
 ఆరోపణ-2: రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న నిర్వచనం ఆధారంగా ‘స్థానికత’(లోకల్ స్టేటస్)ను నిర్థారించాలి.
 వాస్తవం: ప్రభుత్వ రంగసంస్థలకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 వర్తించవని ఉమ్మడి ఏపీ పాలకులు నిర్ణయించి 2009 వరకు కట్టుబడి వున్నారు. గతంలో ఉన్న వాదనతో పాటు విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ మాత్రం ఆధారంకాదు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి పేరు తో 2009 నుంచి ‘371 డీ’ను అమలు చేస్తూ నియమించిన ఉద్యోగులను తెలంగాణ సంస్థలు రిలీవ్ చేయలేదు.
 
 ఆరోపణ-3: రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీకి పంపే అధికారం తెలంగాణ సంస్థలకు లేదు.
 వాస్తవం: ఏపీ విద్యుత్ సంస్థలు తమ వంతు ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను గడువులోగా రూపొందించుకోవడంలో విఫలమైనంత మాత్రాన.. ఆ రాష్ట్ర ఉద్యోగులు తెలంగాణలో శాశ్వతంగా కొనసాగడానికి వీలులేదు. ఏపీలోని టిఉద్యోగులను రిలీవ్ చేయాలని పలుమార్లు కోరినా ఏపీ సంస్థలు ఒప్పుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 75 వేలకుపైగా కొలువులు ఉంటే, విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి నామమాత్రంగా 1,231 మంది వెళ్తుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 450 మంది రావాల్సి ఉంది.
 
 ఆరోపణ-4: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్  సంస్థల పరిధి తెలంగాణకే పరిమితం. ఈ సంస్థల ఉద్యోగులను ఏపీకి పంపలేరు.
 వాస్తవం: రాష్ట్ర విభజన అనంతరం ఏపీసీపీడీసీఎల్ పేరు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌గా మారింది. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు అవశేషాంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. అలాగే విభజన చట్టం ప్రకారం టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఏడు మండలాలు(ఖమ్మం జిల్లా) ఏపీలో విలీనమయ్యాయి. వీటిల్లో విద్యుత్ సరఫరాను ఏపీఈపీడీసీఎల్ చూస్తోంది. ఏపీలో సంస్థలు విలీనమైన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు కూడా జరపవచ్చు.
 

మరిన్ని వార్తలు