ఖరారు కాని ఉచిత విద్యుత్ కోటా!

8 Aug, 2014 01:47 IST|Sakshi

* కనెక్షన్ల కోసం రెండు రాష్ట్రాల్లో 2 లక్షల మంది రైతుల నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏ జిల్లాకు ఎన్ని కనెక్షన్లు మంజూరు చేయాలనే విషయంలో ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఇప్పటికే డీడీలు చెల్లించిన రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విధంగా 31 మార్చి 2014 నాటికి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్షా 70 వేల మంది రైతులు కొత్త కనెక్షన్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. మార్చి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారినికూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఏకంగా 2 లక్షలకు చేరుకుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్త కనెక్షన్లు మంజూరు కాకపోవడంతో రైతులు పక్కదార్లవైపు చూస్తున్నారు.

రైతులు ఈ విధంగా కొక్కేల ద్వారా అనధికారికంగా కరెంటును వాడుకోవడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పదే పదే ట్రిప్ అవుతున్నాయి. అదేవిధంగా లో ఓల్టేజీ సమస్య కారణంగా మోటార్లు కూడా కాలిపోతున్నాయి. ఇది రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీనిని నివారించేందుకు వ్యవసాయ సీజను కంటే ముందుగానే కోటా నిర్ణయిస్తే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు