జపాన్‌ టెక్నాలజీతో  ఇంధన పొదుపు

30 Jan, 2020 04:08 IST|Sakshi
వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సదస్సులో ఇంధన పొదుపు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టెరీ డీజీ మాథుర్‌

ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ టెరీ

ఏపీలో భారీగా పొదుపు అవకాశాలు 

సదస్సులో టెరీ డీజీ అజయ్‌ మాథుర్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సంస్థ టెరీ (ది ఎనర్జీ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌) జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. విద్యుత్‌ వ్యయం నియంత్రణ, పారిశ్రామిక పురోగతి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో (ఎస్‌ఎమ్‌ఈ) 35 శాతం వరకు కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్మెంటల్‌ స్ట్రాటజీస్‌ (ఐజీఈఎస్‌)తో కలసి టేరీ సంస్థ బుధవారం న్యూఢిల్లీలో వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌–2020ని నిర్వహించింది.

ఈ వివరాలను రాష్ట్ర ఇంధనశాఖ మీడియాకు వెల్లడించింది. సదస్సులో టెరీ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ మాథుర్‌ మాట్లాడుతూ ఇంధన సామర్ధ్యం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. జపాన్‌ ఇండియా టెక్నాలజీ మ్యాచ్‌ మేకింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ (జేఐటీఎమ్‌ఎమ్‌పీ) ద్వారా ఐజీఈఎస్‌ తో కలసి టేరీ సంస్థ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందించనుందన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇంధన పొదుపుకు ఏపీలో ఎక్కువ అవకాశాలున్నట్టు టెరీ అధ్యయనంలో వెల్లడైందని మాథుర్‌ తెలిపారు. ఇంధన పొదుపు అమలుకు ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యూనీడో), జీఈఎఫ్‌ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు అజయ్‌ మాథుర్‌ తెలిపారు.  

చౌక విద్యుత్తే లక్ష్యం
సదస్సులో ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి సందేశాన్ని ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ రెడ్డి చదివారు. చౌక విద్యుత్‌ సాధన లక్ష్యానికి ఏపీ కట్టుబడి ఉందని, విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక పరమార్థం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు, పేదవర్గాల ప్రయోజనానికి విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భక్రే, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్ట్రాటజీస్‌ (ఐజీఈఎస్‌) ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ కజుహికో టేకుచి, యునిడో ప్రతినిధి డాక్టర్‌ రెనే వాన్‌ బెర్కెల్‌ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 21 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

>
మరిన్ని వార్తలు