వడ్డీల కోసం.. అప్పులు

22 Oct, 2019 03:44 IST|Sakshi

టీడీపీ హయాంలో విద్యుత్తు రంగం అస్తవ్యస్తం

ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా అప్పులు

కోలుకోలేని స్థితిలోకి విద్యుత్తు పంపిణీ సంస్థలు 

ఏఆర్‌ఆర్‌ల రూపకల్పనలో వెలుగు చూస్తున్న వాస్తవాలు

సాక్షి, అమరావతి: అప్పు తీర్చడం మాట దేవుడెరుగు! అప్పుపై  వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే? గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇదే. ఫలితంగా ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు కోలుకోలేని అప్పుల్లోకెళ్లాయి. గత ఐదేళ్లుగా విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి అంతా సవ్యంగా ఉందంటూ టీడీపీ సర్కారు చేసిన ప్రచారం ఉత్తదేనని తేలిపోతోంది. వాస్తవ గణాంకాలను గత సర్కారు ఏనాడూ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ముందుంచలేదు. తాజాగా అధికారులు చిట్టా తిరగేస్తే కళ్లు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి.

వాస్తవాలు కప్పిపుచ్చి..
ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి టీడీపీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చిన అప్పులకు ఏటా రూ.550 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి వస్తోంది. ఈ వడ్డీ కోసం కూడా మళ్లీ  అప్పులకు వెళ్లడం గత ప్రభుత్వ హయాంలో కనిపిస్తోంది. రోజువారీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు వెల్లడవుతోంది. ఇవన్నీ కమిషన్‌ ముందుంచాలి. కానీ గత ఐదేళ్లుగా కమిషన్‌కు వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టారు.

ఐదేళ్లలో రూ.5,838 కోట్ల అప్పు 
రాష్ట్ర విభజన నాటికి ఏపీలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.2,998 కోట్ల పెట్టుబడి అప్పు (ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం), రూ.7,698 కోట్ల రోజువారీ అప్పు (వర్కింగ్‌ క్యాపిటల్‌) ఉంది. మొత్తం కలిపి అప్పు రూ.10,696 కోట్లుగా ఉంది. 2019 మార్చి నాటికి రూ.ఇది 16,534 కోట్లకు చేరింది. అంటే ఈ ఐదేళ్లల్లో రూ.5,838 కోట్లు కొత్తగా అప్పు చేశారు. ఇందులో వర్కింగ్‌ క్యాపిటల్‌ రూ.7,698 కోట్ల నుంచి రూ.10,354 కోట్లకు పెరిగింది. గత ఐదేళ్లల్లో మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్‌ చార్జీల భారం మోపారు. శ్లాబుల వర్గీకరణతో ఎక్కువ మందికి అధిక విద్యుత్‌ చార్జీలు పడేలా పరోక్ష భారం వేశారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే డిస్కమ్‌ల అప్పులన్నీ తీరి లాభాల్లో ఉండాలి. కానీ ఊహించని స్థాయిలో అప్పులు పెరిగాయి. 

కమిషన్‌ ముందుకు వాస్తవాలు
ఏటా విద్యుత్‌ నియంత్రణ మండలికి డిస్కమ్‌ల వాస్తవ ఆర్థిక పురోగతిని వివరించాలి. ఇలా చేయడం వల్ల అప్పులెందుకు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్ల కోసమే గత సర్కార్‌ ఎడాపెడా అప్పులు చేసిందనే నిజం బయటకొస్తుంది. ఈ కారణంగా వాస్తవ ఆర్థిక పరిస్థితిని కమిషన్‌ ముందుకు తేకపోవడంతో ప్రస్తుతం రూ.16 వేల కోట్లకు పైగా అప్పు కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని కమిషన్‌ ముందుంచాలని విద్యుత్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే వార్షిక ఆదాయ అవసర నివేదికలపై కసరత్తు చేపట్టారు.

ఇక మీదట అప్పులను తగ్గించుకుని ఉన్నవాటి నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా తోడ్పాటు ఇస్తుందని అధికారులు ఆ«శిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఖరీదుతో విద్యుత్‌ కొనుగోళ్లను ఆపేశారు. పవన, సౌర విద్యుత్‌ ధరలను పునఃసమీక్షించే దిశగా కసరత్తు మొదలు పెట్టారు. బొగ్గు, ఇతర కాంట్రాక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టి అనవసర ఖర్చులను తగ్గిస్తున్నారు. వీలైనంత వరకూ డిస్కమ్‌లను అప్పుల నుంచి ఒడ్డున పడేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. 

సకాలంలో ఏఆర్‌ఆర్‌లు: శ్రీకాంత్‌ (ఇంధనశాఖ కార్యదర్శి)
డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలను సకాలంలో ఏపీఈఆర్‌సీ ముందుంచుతామని ఇంధనశాఖ కార్యదర్శి  శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. అప్పులకు వడ్డీలు చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, దీని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యుత్‌ సంస్థల్లో ఇప్పటికే ఆర్థిక నియంత్రణ కొనసాగుతోందని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కాంట్రాక్టుల్లో ప్రజాధనం ఆదా చేస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు