గణేశ్ మండపాలపై విద్యుత్ విజి‘లెన్స్’

8 Sep, 2013 02:07 IST|Sakshi
సాక్షి, గుంటూరు: గణేశ్ మండపాల ఏర్పాటు, విద్యుత్‌వాడకంపై విద్యుత్ విజిలెన్సు అధికారులు దృష్టిసారించారు. విద్యుత్ చౌర్యం చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ చౌర్య నిరోధక విభాగాన్ని ఏర్పాటుచేశారు. గణేశ్ మండపాల దగ్గర విద్యుత్ చౌర్యం జరగకుండా ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యేక రుసుం వసూలుకు నిర్ణయించారు. అటు విద్యుత్తు సంస్థకు నష్టం రాకుండా, గణేశ్ మండప నిర్వాహకులకు భారం కాకుండా ఉండేలా ప్రతి 2 కిలోవాట్‌ల లోపు వాడకానికి రూ.1325 వంతున నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆపైన వాడే ప్రతి కిలోవాట్‌కు రూ.1500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొ త్తాన్ని ముందే డీడీ రూపంలో వసూలు చేస్తున్నారు.
 
ఏటా జిల్లావ్యాప్తంగా 10 నుంచి 12 వేల గణేశ్ మండపాల ఏర్పాటు జరుగుతుంది. మండపాలను ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు 9 రోజులకు మైక్ పర్మిషన్, ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లించి కరెంటు వాడకాన్ని అధికారికం చేసుకుంటారు. ఈ విధంగా రుసుం చెల్లించివారు నిరభ్యంతరంగా ఉత్సవాలు జరిగిన 9 రోజులూ కరెంటును వాడుకోవచ్చు. రుసుం చెల్లించకుండా ఏటా 500పైగా మండపాలు ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి. దీనివల్ల విద్యుత్‌శాఖకు ఎంతో నష్టం వాటిల్లుతోంది. కరెంటు వాడకం జరిగినా అందుకు సరిపడ ఆదాయం మాత్రం అందక ఆ శాఖ అధికారులు తలమునకలయ్యేవారు. ఏటా ఎదురయ్యే ఈ విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న విద్యుత్ అధికారులు ఈ ఏడాది 2 కిలోవాట్స్ లోపు వాడకానికి విధిగా రూ.1325 చెల్లించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీచేశారు.
 
ఒకవేళ ఎవరైనా చెల్లించకపోతే విద్యుత్ వాడకాన్ని అక్కడికక్కడే నిలిపివేయమే కాకుండా నిర్వాహకులపై కేసులు నమోదు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకున్నారు. మండపాల నిర్వాహకులు రుసుం చెల్లించేందుకు వీలుగా గుంటూరు నగరంలోని టీజేపీఎస్ కళాశాల వద్ద వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ విద్యుత్ ఏఈ దగ్గర డీడీ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా 1000 మందికి పైగా మండపాల నిర్వాహకులు ఇప్పటికే డీడీలను చెల్లించారు. ఆదివారం, సోమవారాల్లో కూడా రుసుం వసూలుకు కౌంటర్లు తెరిచే ఉంటాయని విద్యుత్ అధికారులు చెపుతున్నారు. 
 
నిర్లక్ష్యం వద్దు..
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ అక్రమ వాడకంపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ సంతోషరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులు విద్యుత్ వాడకాన్ని సక్రమమైన పద్ధతిలోనే జరపాలనీ, లేకుంటే కేసులు ఖాయమని స్పష్టం చేశారు. 
మరిన్ని వార్తలు