మళ్లీ మైదానానికి

1 Apr, 2018 10:35 IST|Sakshi

కొండదిగివచ్చిన ఏనుగుల గుంపు

వంశధార నదిదాటిన గజరాజులు 

హిరమండలంలోని ఎలుకల మెట్ట కొండపై తిష్ఠ

సారవకోటలోని మాళువ వైపు అడుగులు

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ గజ’

హిరమండలం /ఎల్‌.ఎన్‌.పేట: ఆపరేషన్‌ గజ విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేసిన అటవీశాఖ సిబ్బందికి ఎనిమిది ఏనుగుల గుంపు శనివారం తెల్లవారుజాముకే షాకిచ్చాయి. శుక్రవారం చీకటి పడే సమయానికి ఎల్‌.ఎన్‌.పేట మండలం మల్లికార్జునపురం సమీపంలో కొండల్లోకి వెళ్లిన ఈ ఏనుగుల గుంపు శనివారం తెల్లవారే సరికి మండలంలోని మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మధ్యలో దర్శనమిచ్చాయి. రాత్రే కొండ దిగి మైదాన ప్రాంతానికి చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు రావిచెంద్రి, డొంకలబడవంజ గ్రామాల మధ్య నుంచి వెళ్లిపోయాయి. పొలంలోనే బస్తాలతో ఉన్న డొంకలబడవంజ గ్రామం గేదెల రామారావు అనే రైతుకు చెందిన ఎనిమిది బస్తాల ధాన్యం తినేశాయని రైతు స్థానిక విలేకరులకు చెప్పారు.

రావిచెంద్రి, ధనుకువాడ గ్రామాల పక్కనుంచి మిరియాపల్లి తోటల్లోకి చేరుకున్న ఏనుగులు శనివారం తెల్లవారు జామున మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మధ్య నుంచి వంశధార నదిని దాటుతూ హిరమండలం మండలంలోని రెల్లివలసకు చేరుకున్నాయని అటవీ శాఖ సరుబుజ్జిలి సెక్షన్‌ అధికారి రామలింగేశ్వరరావు, ఎఫ్‌బీఓ పి.లక్ష్మణమూర్తి చెప్పారు. హిరమండలం మండలంలోని అంబావల్లి, పిండ్రువాడ, పిండ్రువాడ కాలనీ సమీప ప్రాంతాల మీదుగా వెళ్లిన ఏనుగులు అక్కడ జీడి, మామిడి తోటలు, జొన్న పంటలను ధ్వంసం చేశాయి. కోదురు సమీపంలోని ఎలుకల మెట్ట కొండపైకి చేరి తిష్ఠవేశాయి.

రెండో రోజూ ‘ఆపరేషన్‌ గజ’
మైదాన ప్రాంతానికి దిగిపోయిన ఎనిమిది ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి తరలించేందుకు రెండో రోజైన శనివారం ‘ఆపరేషన్‌ గజ’ చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచి తీసుకువచ్చిన వినాయక, జై అనే రెండు ఏనుగులతో పాటు వచ్చిన మావటీలను అప్రమత్తం చేశారు. అప్పటికే మల్లికార్జునపురం వద్ద ఉన్న వినాయక, జై ఏనుగులను అలికాం–బత్తిలి రోడ్డు మీదుగా నడిపించుకుంటూ హిరమండలం మండలంలోని భగీరథపురం వరకు తీసుకుని వెళ్లారు. అక్కడ నుంచి ఏనుగుల గుంపును అనుసరిస్తూ ఎలుకల మెట్ట ప్రాంతానికి చేరుకున్నారు. సాయంత్రం సారవకోట మండలంలోని మాళువ వైపు తరలివెళ్లాయి.

 అయితే అటవీ అధికారులు పటిష్టమైన వ్యూహంతో వ్యవహరించి ఏనుగులు తరిమేటప్పుడు గ్రామాల్లోకి ప్రవేశించకుండా నాలుగువైపులా మంటలు పెట్టి బాణసంచా కాల్చి బెదిరించారు. జర్జంగి, పిండ్రువాడ రహదారిపై వాహనాలను, ప్రజలను తిరగకుండా నిలిపివేశారు. విశాఖ పట్టణం సర్కిల్‌ సీసీఎఫ్‌ రాహుల్‌ పాండే, శ్రీకాకుళం, విజయనగరం, డీఎఫ్‌వోలు సీహెచ్‌ శాంతి స్వరూప్, లక్ష్మణ్‌ జూ వైద్యులు నవీన్, శ్రీనివాస్, పాతపట్నం, పాలకొండ, కాశీబుగ్గ ఎఫ్‌ఆర్‌వోలు సోమశేఖర్, జగదీష్, అరుణ ప్రకాష్, లక్ష్మినర్సింహ  పర్యవేక్షణలో దాదాపు వంద మంది అటవీ శాఖ సిబ్బందితో ఈ ఆపరేషన్‌ గజ నిర్వహించారు. అటవీశాఖ సిబ్బందిని టీములుగా నియమించి ఏనుగులు వెళుతున్న దిశలో ఉన్న గ్రామాల్లోని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకొన్నారు.

మరిన్ని వార్తలు