జూలో కలకలం

27 Jan, 2020 13:17 IST|Sakshi

హడావుడి చేసిన కృష్ణ

ఏనుగును కట్టడి చేయడానికి శ్రమించిన జూ సిబ్బంది

ఆరిలోవ(విశాఖతూర్పు): ఓ వైపు సందర్శకుల కిటకిట.. అంతలోనే అలజడి.. దీంతో ఒక్కసారిగా జూ పార్కులో కలకలం రేగింది. జూలో బంధించి ఉన్న కృష్ణ పరుగులెత్తింది..జూ అధికారులను, సిబ్బందిని, సందర్శకులను ఆందోళనకు గురిచేసింది. కృష్ణ అనే 34 ఏళ్ల మగ ఏనుగు ఆదివారం హడావుడి చేసింది. అధికారుల గుండెల్లో గుబులు పుట్టించింది. 

ఇదీ పరిస్థితి : ఇది ఇక్కడ మావాటి వారి మాట కూడా వినదు. తోటి ఏనుగుల మీద సైతం దాడిచేస్తుంది. దీంతో సుమారు 10 ఏళ్లగా కృష్ణను జూ సిబ్బంది ఇనుప సంకెళ్లతో కట్టి ఏనుగుల మోటోలో సందర్శకులకు దూరంగా ఉంచారు. ఏనుగులు సాధారణంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో శృంగార తాపానికి గురవుతుంటాయని యానిమల్‌ కీపర్లు అంటున్నారు. ఇక్కడ ఉన్న నాలుగు ఏనుగుల్లో మిగిలిన మూడింటిని దాని నుంచి వేరుచేసి దూరంగా ఉంచుతున్నారు. దీంతో తోడులేని ఆ ఏనుగు కకావికలమై దాని కాళ్లకు కట్టిన ఇనుప సంకెళ్లను సైతం తెంపేసింది.  మోటో నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేసింది. ఎత్తైన గోడలు, మోటు లోపల గోడలను ఆనుకొని ట్రంచ్‌ తవ్వి ఉండటంతో బయటకు రాలేకపోయింది. మధ్యాహ్నం  ఒంటి గంట సమయం మోటులో పరుగులు పెడుతూ గీంకరిస్తూ సిబ్బందిని ఆటాడించింది. దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది నానా హైరానా పడ్డారు. ఓ దశలో జూ అధికారులు దీన్ని ఎలా కట్టడిచేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మత్తిచ్చి పట్టుకోవడానికి కూడా ఆలోచన చేశారు. ఎట్టకేలకు చాకచక్యంతో సిబ్బంది ఇనుప గొలుసులు, తాళ్లతో బందించి పట్టుకొన్నారు. దీంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. కృష్ణ హడావుడి చేసిన వెంటనే సందర్శకులను అటుగా వెళ్లకుండా జూ సిబ్బంది జాగ్రతపడ్డారు.  ఏనుగు బయటకు వచ్చేసిందంటూ టికెట్లు కొన్నవారు కూడా తిరుగుముఖం పట్టారు.

గతంలో శాంతి హడావుడి : సుమారు 13 ఏళ్ల కిందట వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన శాంతి అనే ఆడ ఏనుగు ఇదే మాదిరిగా చిందులేసింది. మోటు బయట పరుగులెడుతూ అప్పటి జూ అధికారులను బెంబేలిత్తించింది. లారీ నుంచి దించుతుండగా ఇక్కడ మోటులోకి వెళ్లకుండా బయటకు పరుగులు తీసింది.

మరిన్ని వార్తలు