వీడని గజరాజుల బెడద

7 Feb, 2019 08:14 IST|Sakshi
స్వామినాయుడువలస పరిసరాల్లో తిరుగుతున్న గజరాజులు

పంటలు ధ్వంసం రైతుల్లో ఆందోళన

తరలించే ప్రయత్నాల్లో అగ్ని ప్రమాదం

నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న అటవీశాఖ సిబ్బంది

విజయనగరం, కొమరాడ:  ఏనుగుల సంచారంతో కొన్నాళ్లుగా మండల వాసులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. ఆరు నెలల కిందట ఎనిమిది ఏనుగల గుంపు మండలంలో ప్రవేశించగా.. ఒక ఏనుగు విద్యుదాఘాతంతో చనిపోగా.. ఇటీవల నాగావళి నది ఊబిలో మునిగిపోయి మరో ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న ఆరు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి, సీతంపేట అటవీప్రాంతల నుంచి గత సంవత్సరం సెప్టెంబర్‌లో కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలంలోకి అక్కడ నుంచి నియోజకవర్గంలోని గరుగుబిల్లి, కొమరాడ మండలంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం కొమరాడ మండలంలో ఎక్కువగా తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు వచ్చిన రూట్‌లోనే వాటిని వెనక్కి తరలించాలని  అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. వాటిని తరలించడానికి ప్రయత్నిస్తున్నా అవి ఏమాత్రం సఫలం కావడం లేదు. అలాగే ఆరుగాలం కష్టపడి పండించే పంటలను కళ్లముందే గజరాజులు ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతులున్నారు. ప్రభుత్వం అందించే అరకొర పరిహారంతో సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి తరలించే శాశ్వత ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ఆందోళనకు సిద్ధమని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు.

పంటలు నాశనం..
మండంలోని కళ్లికోట, దుగ్గి, గుణానపురం, స్వామినాయుడువలస, తదితర గ్రామాల్లోని జొన్న, చెరుకు, టమాటో, తదితర పంటలను ఏనుగులు తీవ్రంగా ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఎవరైనా పొలాల్లో ఉంటే దాడి కూడా చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఏనుగుల దాడుల్లో గాయపడ్డారు. మంగళవారం ఉదయం కళ్లికోటలో శీర తిరుపతికి చెందిన మూడు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరలించే ప్రక్రియలో అటవీశాఖ సిబ్బంది బుధవారం ఉదయం మందుగుండు కాల్చడంతో వాటి నిప్పురవ్వలకు స్వామినాయుడువలసకు చెందిన కందశ శ్రీనివాసరావు, బలగ కోటి, తదితర రైతుల చెరుకు తోటలు కాలిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు విషయం తెలియజేసి ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి సారించాలి..
ఏనుగుల తరలింపులో అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఇప్పటికే నా మూడున్నర ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.–  శీర తిరుపతి, రైతు, కళ్లికోట

మరిన్ని వార్తలు