అంతులేని ధ్వంస రచన

11 May, 2019 14:02 IST|Sakshi
హిరమండలం: తంప, దనుపురం సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

అడవుల్లో కొరవడిన  ఆహారం, నీరు

పంట పొలాలపైకి వస్తున్న   ఏనుగులు

రెండు రోజులుగా

పాతపట్నం పరిసరాల్లో హల్‌చల్‌

సీతంపేట, పాతపట్నం, హిరమండలం:ఏనుగులు మళ్లీ తడాఖా చూపిస్తున్నా యి.. రెండు రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం తదితర ప్రాంతాల్లో వీరవిహారం చేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. హిరమండలంలోని తంప, దనుపురం గ్రామాల మధ్య ఉన్న జీడి, మామిడి తోటలను ఏనుగులు శుక్రవారం ధ్వంసం చేశాయి. కొండప్రాంతాల్లో ఉండాల్సిన ఏనుగులు మైదాన ప్రాంతాల్లో సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పాతపట్నంలో సంచరించిన ఏనుగుల గుంపు.. శనివారం ఉదయం కొరసవాడ మీదుగా తంప దనుపురం గ్రామాల మధ్యనున్న కొండపైకి చేరుకొని తిష్టవేశాయి. రాత్రి వేళల్లో ఇవి గ్రామాల్లోకి చొరబడిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పొలిమేరల్లో సంచరించడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపు గురువారం రాత్రి పాతపట్నం మండలం రొంపివలస,సీది నుంచి మహేంద్రతనయ నదీ తీరం మీదుగా తంప–దనుపురం ప్రాంతానికి చేరుకోవడంతో అటవీశాఖ సిబ్బంది స్ధానికులను అప్రమత్తం చేస్తున్నారు.

పుష్కరకాలంగా ఇదే అవస్థ..
ఏనుగులు, జనానికి మధ్య ఎలాంటి వైరం లేకపోయినా ఇరువర్గాల నడుమ జీవన పోరాటం పన్నెండేళ్లుగా సాగుతోంది. ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాల్లోని ప్రజల అవస్థ అంతా ఇంతా కాదు. 2007లో ఏనుగులు సీతంపేట మన్యంలో ప్రవేశించాయి. రెండేళ్ల కిందట మరో ఏనుగుల గుంపు మందస వైపు నుంచి వచ్చి చేరాయి. సీతంపేట ఏజెన్సీలో ప్రస్తుతం నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తుండగా మెళియాపుట్టి, పాతపట్నం మండలా ల్లో ఆరు ఏనుగులు సంచరిస్తున్నాయి. సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. పంటనష్టం షరా మామూలుగా మారగా అప్పుడప్పుడు ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి వివిధ రకాల చెట్లకు నిలయమైన ఏజెన్సీ కొండప్రాంతాలు ఇప్పుడు విస్తీర్ణం తగ్గిపోయింది. అభివృద్ధి పేరిట అడవుల్లో రహదారులు, విద్యుత్‌ లైన్లు, రావడం కొండపోడు వంటి వాటి పేరుతో కాల్చి వేయడంతో మూగజీవాలకు సైతం నిలువ నీడలేక మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఒడిశా లకేరీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లు నరకడం, అడవుల్లో జనసంచారం, అలజడి సృష్టించడం కారణంగా ఇటు వైపు ఏనుగులు వచ్చేస్తున్నాయి. ఏనుగులు గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పటికీ వాటికి అవసరమైన చెట్ల పెంపకాన్ని అటవీశాఖ చేపట్టలేదు. వెదురు, రావి, వెలగ, మర్రి, చింత, ఇతర పండ్ల జాతుల చెట్లు, దట్టమైన పచ్చిక బైళ్లు ఏనుగులకు ఆహారం. కానీ అడవుల్లో ఈ జాతులు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది. దీం తో గిరిజనులు పండించిన వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 6 వేల ఎకరాలకు పైగా పంటల నష్టం సంభవించింది. గిరిజనులు లక్షల్లో నష్టపోతే పరిహారం అరకొరగా అందజేస్తున్నారు.

నీరే ప్రధానం..
ఏనుగుల నివాసానికి నీటి వసతి అత్యంత ప్రధానమైంది. వాటి చర్మం దళసరిగా ఉండడంతో వేడిని తట్టుకోవడానికి తరుచుగా నీరు తాగడం, మీద చల్లుకోవడం చేస్తుంటాయి. భరించలేని పరిస్థితుల్లో బురద మట్టిని దేహనికి పూసుకుంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏనుగులకు కావా ల్సిన మేత కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించడంతోనే అటవీ శాఖ గతంలో అడవుల్లో నీటి కుంటలు నిర్మించారు. అనంతరం వీటి నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో చాలావరకు నిరుపయోగంగా మారాయి. ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడే ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. ప్రస్తుతం సీతంపేట మండలంలోని బొండిగెడ్డ వద్ద నీరు ఉండడంతో అక్కడ గత పక్షం రోజు లుగా తిరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంత గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. మహేంద్రతనయలో నీరు ఉండడంతో అక్కడ కొన్ని ఏనుగులు తిష్టవేశాయి.

శాశ్వత పరిష్కారాలు లేవా...?
ఏనుగులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వేసవిలోనూ వాటికి మేత, నీరు లోటు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తే దాడుల తీవ్రత బాగా తగ్గించవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏనుగుల నియంత్రణకు కొద్ది రోజుల కిందట కందకాలు తవ్వడం వంటివి చేసినప్పటికీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఆ కందకాల్లో గిరిజనులకు చెంది న ఆవులు, మేకలు వంటివి పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సోలార్‌ కంచె వంటివి ఏర్పాటు చేసినా అంత ఫలితం ఉండదని గిరిజనులు చెబుతున్నారు. మరోవైపు తమ జీవనానికి ఆటంకం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు