వదలని గజరాజులు

8 Mar, 2019 07:34 IST|Sakshi
రబ్బర్‌డ్యాం పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

 దెబ్బతిన్న పంటలు

లబోదిబోమంటున్న రైతులు   

విజయనగరం, కొమరాడ : మండలంలోని రైతులకు గజరాజుల భయం వీడడం లేదు. కొద్ది నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాగావళి పరివాహక ప్రాంతంలో వారం రోజుల కిందట జియ్యమ్మవలస మండలం బాసంగి వద్ద సంచరించిన ఏనుగులు తరువాత నాగావళి పరివాహక ప్రాంతాన్ని దాటుకుంటూ గుణానపురం, కళ్లికోట, దుగ్గి, ఆర్తాం, కుమ్మరిగుంట, రబ్బర్‌డ్యాం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో జంఝావతి రబ్బరు డ్యాం పరిసర ప్రాంతంలో గజరాజులు సంచరించి రత్నరెడ్డి అనే రైతు పొలంలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తుండగా దాడి చేశాయి. 36 బస్తాల ధాన్యాన్ని చిందరవందర చేశాయి. మోటారు పైపులను ధ్వంసం చేశాయి. దీన్ని గుర్తించిన రైతు అక్కడి నుంచి పరుగులు తీశాడు. గురువారం ఉదయం కూడా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అటవీ శాఖాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకెన్నాళ్లు ఈ బాధలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు