వనాలు తరిగి.. జనాలపైకి ఉరికి..

23 Nov, 2018 07:21 IST|Sakshi
వీరఘట్టం మండలం గాదెలంకలో ఏనుగులు నాశనం చేసిన వరిపంట(ఫైల్‌ఫోటో)

భారీగా జరుగుతున్న మైనింగ్‌తో అంతరిస్తున్న వనాలు

జనారణ్యంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు

జిల్లాలోకి మరికొన్ని వచ్చే అవకాశం

ఆందోళనలో అటవీ ప్రాంత ప్రజలు

పట్టించుకోని అటవీశాఖ అధికారులు

జిల్లా వాసులను ఏనుగుల భయం వెంటాడుతూనే ఉంది. 11 ఏళ్ల క్రితం ఒడిశాలోని లకేరీ అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకొచ్చిన గజరాజులు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇక్కడే ఉండిపోయాయి. తాజాగా ఎనిమిది ఏనుగుల గుంపు కూడా కొద్ది నెలల క్రితం జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో జనం భయాందోళన చెందుతున్నారు. పంటలపై పడి నాశనం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో జనం కూడా ఏనుగుల దాడిలో చనిపోయారు. అయినా అటవీ శాఖ అధికారులు వీటిని సాగనంపే ఏర్పాట్లపై మీనమేషాలు లెక్కిస్తున్నారు తప్పితే సీరియస్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మైనింగ్‌ జోరుగా జరుగుతుండడంతో మరికొన్ని ఏనుగులు సిక్కోలు ఏజెన్సీలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారం అధికారులను.. ప్రజలను కలవర పెడుతోంది.

శ్రీకాకుళం, వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో ఏనుగుల గుంపుల సంచారం వెనుక మానవ తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. వాటి ఆవాసాలపై అక్రమార్కులు దాడులు చేస్తే అవి కూడా దాడులు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జరుగుతున్న మైనింగ్‌ కారణంగానే అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి.  శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో అటవీ భూములు 616 చదరపు కిలోమీటర్లు. 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే  వన్యప్రాణులకు, ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. వన్యప్రాణులు ఉండేందుకు సరైన ఆవాసాలు  లేవని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో 11 ఏళ్లలో రెండు పర్యాయాలు రెండు గుంపులుగా వచ్చిన 11 ఏనుగులు అడవుల్లో ఉండలేక జనారణ్యంలోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. జనాలపై విరుసుకుపడి ప్రాణాలను హరిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..
జిల్లాకు పక్కనే అతి సమీపంలో ఒడిశా రాష్ట్రంలోని లకేరీ అటవీ ప్రాంతంలో అభయారణ్యం ఉంది. ఇందులో వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అభయారణ్యం చుట్టూ విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు కూడా ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకు అక్కడ మైనింగ్‌ మాఫియా చేపడుతున్న బాంబ్‌ బ్లాస్టింగ్‌ల వల్ల ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెద్ద శబ్దాలకు భయపడడం ఏనుగుల నైజం. బాంబు బ్లాస్టింగ్‌ వల్ల భయంతో ఒడిశా అటవీ ప్రాంతాన్ని వదిలి శ్రీకాకుళం జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి చొచ్చుకువస్తున్నాయి.

గజ భయం
సిక్కోలు ప్రజలను గజ భయం వెంటాడుతోంది. ఇప్పటికే గత 11 ఏళ్లలో రెండు పర్యాయాలు రెండు గుంపులుగా వచ్చిన ఏనుగులతోనే భయభ్రాంతులకు గురవుతున్న అటవీ ప్రాంత ప్రజలకు మరో ముప్పు పొంచిఉందనే సమాచారం చేరింది. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. ఒడిశా లకేరీ అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల గుండా ప్రవేశిస్తున్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఏళ్ల తరబడి కదలకుండా తిష్ఠ వేశాయి. ఇప్పుడు మరో గుంపు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.  

నిద్రావస్థలో సర్కార్‌
ప్రభుత్వం కృత నిశ్చయంతో ప్రయత్నిస్తే ప్రస్తు తం ఉన్న ఏనుగుల గుంపును తరలించవచ్చు. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవచ్చు.అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ఓసారి చేపట్టిన ఆపరేషన్‌ గజ కూడా సత్ఫలితా లు ఇవ్వలేదు. అటవీశాఖ అధికారులు ఏమైనా వ్యూహరచన చేస్తున్నారంటే అదీ లేదు. చివరకు జిల్లాలో ఏనుగులు సంచరిస్తే ఎంతో మేలు అన్నట్లుగా ఈ శాఖ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఏనుగులను తరలించే చర్యల్లో భాగంగా పుష్కలంగా నిధులు ఖర్చు చేయవచ్చు. వాటికి లెక్కలు అడిగేవారుండరు.

అమలు కాని హామీలు...
2007లో ఒడిశా నుంచి జిల్లాలోకి చొరబడిన ఏనుగులు ఇంతవరకూ 11 మందిని హతమార్చాయి. పలువురుని గాయపరిచాయి. గతంలో అటవీశాఖ మంత్రిగా పని చేసిన శత్రుచర్ల విజయరామరాజు పాలకొండ, కురుపాం అటవీ రేంజ్‌ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఏనుగులు సంచరించే అభయారణ్యం (ఎలిఫెంట్‌ జోన్‌)గా మార్చుతామని ప్రకటన చేశారు. అయితే ఒక ప్రాంతాన్ని అభయారణ్యంగా చేయాలంటే రూ.కోట్ల నిధులు ఖర్చుతో కూడుకున్న పని. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది మందికి జీవనోపాధి కల్పించి, ఆవాసం కల్పించాలి. ఇలా చేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాలి. దీంతో అప్పటి ప్రభుత్వం అభయారణ్యం ప్రతిపాదనను పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి ఏనుగుల గుంపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ ఒడిశా అడవుల వైపు వెళుతూ మరలా వెళ్లిన తోవలోనే తిరిగి జిల్లాలోకి వచ్చేస్తున్నాయి. ఇలా ఏనుగులు వస్తూ..పోతూ ఉండడంతో ఇవి నడిచే ప్రాంతాల్లో ఉన్న పంటలు నాశనమౌతున్నాయి. ఏనుగులను తరలించేందుకు కూడా  ఇప్పటి ప్రభుత్వం చొర వ చూపక పోవడంతో ప్రాణ భయంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. వీటికి తోడు మరో ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో గిరిజనులు వణికిపోతున్నారు.

మరిన్ని వార్తలు