ఏనుగులను కవ్వించొద్దు

9 Jan, 2020 12:57 IST|Sakshi

ఒడిశాకు తరలించేందుకు చర్యలు

జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌ కృపాకర్‌  

శ్రీకాకుళం, వీరఘట్టం: ఏనుగులను ఎవరూ కవ్వించొద్దని జిల్లా అటవీశాఖ అధికారి జి.సందీప్‌కృపాకర్‌ అన్నారు. వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరిలించేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన డీఎఫ్‌ఓ విలేకర్లతో మాట్లాడారు. ఏనుగులను ఒడిశాలోని లఖేరీ అడవులకు తరలించేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏనుగులను తరలిస్తున్నప్పుడు సమీప గ్రామాల ప్రజలు అలజడులు చేస్తే తిరగబడే అవకాశం ఉందన్నారు. ఏనుగులను రెచ్చగొట్టకుండా అటవీశాఖ అధికారులు పహారా కాస్తున్నారన్నారు. మొత్తం 20 మంది ట్రాకర్లు, రెండు జిల్లాలకు చెందిన 15 మంది అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. కురుపాం ఎఫ్‌ఆర్‌ఓ మురళీకృష్ణ, పార్వతీపురం సబ్‌ డీఎఫ్‌ఓ రాజారావు, పాలకొండ రేంజర్‌ సోమశేఖరరావు, వీరఘట్టం డీఆర్‌ఓ విఠల్‌కుమార్‌ ఉన్నారు. 

రాత్రంతా ఆందోళన..
ఏనుగులు వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి సంచరించడంతో కూరగాయల రైతులు, పొలాల్లో వరి కుప్పలు వేసిన రైతులు ఆందోళన చెందారు. మొక్కజొన్న, చెరుకు, కూరగాయల పంటలను ధ్వంసం చేశాయని రైతులు అన్నారు. ఏగునులు రాత్రంతా వీరఘట్టం ఒట్టిగెడ్డ సమీపంలోని కొట్టుగుమ్మడ బ్రిడ్జి పరిసరాల్లో తిరిగాయన్నారు. ఎం.రాజపురం జంక్షన్‌ మీదుగా తెల్లవారు జామున సీఎస్‌పీ రహదారి దాటుకుంటూ అచ్చెపువలస కొండలవైపు వెళ్లాయన్నారు. 

మరిన్ని వార్తలు