వచ్చిన దారినే...

10 Nov, 2018 08:25 IST|Sakshi
గడసింగుపురం వద్ద సంచరిస్తున్న ఏనుగుల గుంపు

గజరాజుల తిరుగు పయనం

గడసింగుపురం – సంతనరిసిపురం మధ్య సంచారం 

జిల్లాలోకి ఏనుగుల గుంపు ఏ మార్గంలో ప్రవేశించాయో అదే మార్గంలో వెనక్కి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. శుక్రవారం రాత్రి జిల్లాను వీడి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు కూడా చేపట్టినట్టు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. మరోవైపు గజరాజులు ఎప్పుడు జిల్లాను దాటి వెళ్తాయా? అని ఆసక్తితో చూస్తున్నారు.

విజయనగరం, జియ్యమ్మవలస: జిల్లాలోని ఏజెన్సీలోకి వచ్చిన గజరాజులు వచ్చిన మార్గానే వెనక్కి తరలుతున్నాయి. సెప్టెంబరు 6న మండలంలోని ఏనుగులగూడ, గడసింగుపురంలో ప్రవేశించిన ఎనిమిది ఎనుగుల గుంపు పెదబుడ్డిడి, అంకవరం, కుదమ, గిజబ, బాసంగి, వెంకటరాజపురం నుంచి కొమరాడ మండలం గుణానుపురం, అర్తాం తదితర గ్రామాల మీదుగా ఒడిశా రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట ప్రవేశించాయి. తిరుగు పయనంలో మండలంలో ఈ నెల 4న ఏడు ఏనుగులు వెంకటరాజపురంలో తిష్ట వేశాయి. వీటిలో ఒక ఏనుగు అర్తాం వద్ద విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బంది తేనెటీగల శబ్దాన్ని అనుకరించి వచ్చిన తోవనే వెళ్లేటట్టు ఏర్పాటు చేశారు. చింతలబెలగాం, గవరమ్మపేట, పరజపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో సంచరిస్తూ వచ్చిన తోవనే వెళ్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి కుదమ మీదుగా చినబుడ్డిడి, అంకవరం నుంచి గడసింగుపురం వద్ద తిష్టవేశాయి. శుక్రవారం రాత్రికి వచ్చిన మార్గంలోనే ఏనుగులగూడ, గడసింగుపురం గ్రామాల మీదుగా జిల్లా వీడి వెళ్లే అవకాశం ఉందని అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. ఏ మార్గంలో వచ్చాయో అదే మార్గంలో వెనక్కి పంపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు