11 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్‌

16 Jun, 2018 09:38 IST|Sakshi
పట్టుబడిన దుంగలు, స్మగ్లర్లు, వాహనాలతో పోలీస్‌ అధికారులు 

సాక్షి, రైల్వేకోడూరు : రైల్వేకోడూరులోని శేషాచలం సమీపాన ఉన్న ప్రదేశాల్లో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 11 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 22 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీలోని హెలీప్యాడ్‌ సమీప ప్రాంతం, ఓబులవారిపల్లె మండలం బాలిశెట్టిపల్లె సమీపంలోని గుంజనేరు వద్ద, చిట్వేలి మండలం గొట్టిమానుకోన అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు వాహనాలలో లోడ్‌ చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైల్వేకోడూరుకు చెందిన కుంభకోణం శ్రీరాములు ఆచారి, చమర్తి సుబ్బరాజు, కుంభా వెంకటరమణ, షేక్‌ జాబీర్, తమిళనాడుకు చెందిన వెంకటేష్, కొండూరు రాజశేఖర్‌రాజు, పంటా సురేష్, కమినబోయిన రామకృష్ణ, వినోద్‌కుమార్, బయనబోయిన గుర్రయ్య, బోయ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగల విలువ రూ.లక్ష 12 వేలు 800 ఉంటుంది.  పారిపోయిన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కె.సాయినాథ్, ఎస్సైలు పి.వెంకటేశ్వర్లు, 
ఎమ్‌.భక్తవత్స లం, హెచ్‌.డాక్టర్‌ నాయక్, పి.సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు