కరగని గుండె!

13 Jun, 2019 12:30 IST|Sakshi
నా చేయి తడపనిదే పని అవ్వదని చెప్పానా లేదా..! 

మాజీ ఎమ్మెల్యే రాక్షసత్వం

మృతుల కుటుంబాలకు అందని పరిహారం 

మూడేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నా.. పట్టించుకోని వైనం 

చేయి తడపలేదనే మోకాలడ్డు  

సాక్షి, ఏలూరు టౌన్‌(పశ్చిమ గోదావరి): తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. వారిలో ఒకరి కుటుంబానికి  ఎక్స్‌గ్రేషియా అందగా.. మరో రెండు కుటుంబాల సభ్యులు ప్రజాప్రతినిధుల వద్దకు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కానరాలేదు. ఇంతకీ ఆ సొమ్ము ఎందుకు రాలేదంటే.. సదరు ప్రజాప్రతినిధికి అడిగినంత డబ్బులు ముట్టజెప్పలేదట. ఆ అక్కసుతో ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం అందకుండా ఆ ఎమ్మెల్యే మోకాలడ్డినట్టు తెలుస్తోంది. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తే మూడేళ్లు గడిచినా నేటికీ ఆ సొమ్ము రాలేదంటూ రెండు కుటుంబాలు బావురుమంటున్నాయి.

అసలేం జరిగిందంటే..!
2016 జూలైలో ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద  అగి ఉన్న బస్సును తప్పించబోయి ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాల్వలోకి పడిపోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒకరు తణుకు పట్టణానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు, పెదనిండ్రకొలనుకు చెందిన వారు.  ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అందులో తణుకుకు చెందిన విద్యార్థి కుటుంబానికి అక్కడి ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకుని డబ్బులు ఇప్పించారు. ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఇద్దరి కుటుంబ సభ్యులు మూడేళ్ల నుంచి ఎమ్మెల్యే, కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే మాజీ అయ్యారు.  

డబ్బులు ఇవ్వలేదనే !
2016 జూలైలో అంటే.. మూడేళ్ళ క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో ఉంగుటూరుకు చెందిన కొప్పుల వెంకట త్రినాథ దుర్గారావు మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇక నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వానపల్లి పెద్దిరాజు కూడా బస్సు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరి కుటుంబాలకు  ప్రభుత్వం చెల్లిస్తానన్న పరిహారం కోసం ఏళ్ళ తరబడి ఎమ్మెల్యే ఇంటిచుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇద్దరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షలు రావాల్సి ఉంది. ఇంత మొత్తంలో డబ్బులు వస్తాయి గనుక.. తన వాటా ముందుగానే ఇవ్వాలని ఆ ప్రజాప్రతినిధి డిమాండ్‌ చేశారు. కానీ ఈ రెండు కుటుంబాలు తమకు నష్టపరిహారం ఇప్పిస్తే తప్పకుండా డబ్బులు ఇస్తామని, తమకు ప్రస్తుతం  అంత డబ్బులు ఇచ్చే స్తోమత లేదని ప్రజాప్రతినిధిని అర్థించారు. కానీ ఆయన మనస్సు మాత్రం కరగలేదు. ముందుగానే చేయి తడపాలంటూ కచ్చితంగా తేల్చిచెప్పేశారు. అదేమంటే ఇదిగో వస్తుంది, కలెక్టర్‌ దగ్గర ఫైలు ఉందంటూ  మభ్యపెడుతూ వచ్చారు. 

ముఖ్యమంత్రి జగన్‌పైనే ఆశ 
ఇప్పుడు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం, ఆ ఎమ్మెల్యే మాజీ అయిపోవడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేస్తారనే ఆశతో ఆ రెండు కుటుంబాలు ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు