ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో హంగామా

3 Jan, 2020 13:41 IST|Sakshi
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో డ్యాన్సులు వేస్తున్న ఆస్పత్రి ఉద్యోగులు, సిబ్బంది

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో వైద్యాధికారులు స్టెతస్కోప్‌ పక్కనపెట్టి ఆటపాటల్లో మునిగి తేలారు. సిబ్బంది స్టెప్పులేస్తుంటే మైమరిచిపోయి.. రోగులను గాలికొది లేశారు. గురువారం ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ ఆస్పత్రి సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ హంగామా చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌కు సన్మానం పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మానం పక్కనబెడితే ఆస్పత్రిలోని నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు, ఆసుపత్రి వైద్య అధికారులు, ఆస్పత్రి సిబ్బంది, కార్మికులు ఇలా అంతా కొన్ని గంటలపాటు నృత్యాలు చేస్తూ ఆనందించారు. రోగులను గాలికి వదిలేశారు.

వేలాది మంది రోగులు వైద్యం కోసం వేచి చూస్తున్న సమయంలో ఇలా విధులను వదిలిపెట్టి చిందులేయడంపై రోగులు, వారి బంధువులు మండిపడ్డారు.  నర్సింగ్‌ సూపరింటెండెంట్, హెడ్‌ నర్సు, క్వాలిటీ కంట్రోలర్, ఫార్మాసిస్ట్‌ ఇలా చాలామంది సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ గోలగోల చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోహన్‌ వీరిని వారించకుండా చోద్యం చూశారని, గంటల తరబడి విధులకు డుమ్మా కొట్టి హంగామా చేయాల్సిన పనేంటని రోగులు ప్రశ్నించారు. రోగులను పట్టించుకునేందుకు ఖాళీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు