మాటల మూటలేనా!

21 Nov, 2015 01:35 IST|Sakshi

ఏలూరు (మెట్రో) :జిల్లాలో కురిసిన వర్షాలకు తడిసిన పంట కుళ్లిపోతోంది. నీట నానుతున్న పనలు.. తడిసి ముద్దయిన కుప్పలు.. వెన్నువిరిగి నీట నానుతున్న చేలను చూసి అన్నదాతల గుండె చెరువవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పంట నష్టాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని ప్రకటించారు. ఈ మాటలు కాస్త ఊరటనిచ్చినా.. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులను గట్టెక్కించే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (రాయితీతో కూడిన పెట్టుబడి) ఇస్తామని మంత్రి పుల్లారావు ప్రకటించారు. గత అనుభవాల దృష్ట్యా మంత్రి ప్రకటన అమలుకు నోచుకుంటుందో లేదోనన్న అనుమానం రైతులను వెన్నాడుతోంది.
 
 గతంలోనూ ఇంతే..

 గతంలోనూ ప్రకృతి వైపరీత్యాలకు ఇదేవిధంగా పంటలు దెబ్బతినగా.. రూ.136 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తామని వేర్వేరు సందర్భాల్లో సర్కా రు ప్రకటించింది. నేటికీ రైతుకు ఒక్కపైసా కూడా అందలేదు. 2012లో కురి సిన భారీ వర్షాలకు 11వేల 577 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 10వేల 345మంది రైతులకు రూ.2.78 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంది. 2013 ఆగస్ట్‌లో గోదావరి వరదల కారణంగా లంక గ్రామాల్లోని 5వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. వీటిని సాగు చేసిన వెయ్యి మంది రైతులకు రూ.30 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం నేటికీ సొమ్ము విడుదల చేయలేదు. 2013 అక్టోబర్‌లో భారీ వర్షాలకు 50 వేల 35 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టు గుర్తించిన సర్కారు 38వేల 685 మంది రైతులకు రూ.19.96 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
 
  ఆ మొత్తం ఇప్పటికీ రైతులకు అందలేదు. 2013 నవంబర్‌లో హెలెన్ తుపాను బీభత్సానికి 1,96,655 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా, 1,53,207 మంది రైతులకు రూ.78.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇంకా చెల్లించలేదు. 2014 అక్టోబర్‌లో నకిలీ విత్తనాల కారణంగా 5వేల ఎకరాల్లో పంటలు సాగు చేసిన 2,600 మంది రైతులకు రూ.5 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయి చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ అధికారిక గణాంకాలే. ఇదికాకుండా 2012లో సంభవించిన నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్లో 572 మందికి రూ.22 లక్షలను ఇప్పటికీ చెల్లించలేదు. గత నష్టాలకు సంబంధించిన పెట్టుబడి రాయితీ ఇప్పటికీ అందని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి శుక్రవారం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీపై ప్రకటనపై రైతులు పెదవి విరుస్తున్నారు.
 
 ధాన్యం ధర సంగతేమిటి
 గతంలో వర్షాలు కురిసినప్పుడు, తుపానులు సంభవించినప్పుటు తేమ శాతానికి అనుగుణంగా ధరలు నిర్ణయిస్తూ వచ్చారు. ఈ విధానాన్ని రైతులు, రైతు సం ఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తడిసి, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ప్రస్తుత నష్టాల్ని దృష్టిలో పెట్టుకుని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. వ్యవసాయ మంత్రి తేమ ఉన్న, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు తప్ప తేమ ఏమేర ఉంటే కొనుగోలు చేస్తారో, ఏ ధరకు కొంటారో అనే విషయాల్ని స్పష్టం చేయలేదు. వాస్తవానికి ఈ రెండు రోజులే రైతులకు కీలకం. తక్షణమే స్పష్టమైన ఆదేశాలు ఇస్తేనే తప్ప తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ప్రయోజనం కలగదు.
 
 

మరిన్ని వార్తలు