మాయదారి రోగం..హడలిపోతున్న ప్రజలు

10 Jul, 2019 08:44 IST|Sakshi
శుక్రవారం మృతి చెందిన ఆవుతో టీఆర్‌ కండ్రిగ కాలనీకి చెందిన పాడి రైతు తులసమ్మ

కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

మృత్యవాతపడుతున్న పశువులు

కుదేలవుతున్న పాడిరైతు

కన్నెత్తి చూడని పశువైద్యశాఖ

‘‘మాయదారి రోగం మా ఊర్లో పశులన్నింటినీ మింగేస్తోందయ్యా.. ఏం రోగమో అంతుబట్టడడం లేదు. బాగానే ఉంటాయి.. రాత్రి పడుకున్న ఆవు తెల్లారేసరికి చనిపోతోంది. పశువుల డాక్టరు మాఊరికి వచ్చి మూడేళ్లకు పైగా అవుతోంది. ఏదైనా ఉంటే అటెండర్‌కు ఫోన్‌ చేస్తాం. ఆయన వచ్చి రెండు సెలైన్లు పెడతాడు. అయినా తెల్లారేసరికి చనిపోతున్నాయి. వేణుగోపాలసాగర్‌ ప్రాజెక్టులో మా భూములన్నీ పోయాయి. బతికేందుకు వేలకు వేలు అప్పులు చేసి నాలుగు ఆవులు, గేదెలను కొనుక్కున్నాం. ఒక్కొక్కటి ఇలా చనిపోతుంటే మేం ఎట్లా బతకాలయ్యా.. ఆ మాయదారి రోగమేదో మాకు వస్తే బాగుండేది.. ఈ బాధలన్నీ లేకుండా హాయిగా ఊపిరి వదిలేస్తాం...’’ ఇదీ పుత్తూరు మండల పరిధిలోని తడుకు పంచాయతీకి చెందిన పాడి రైతుల ఆవేదన.

సాక్షి, పుత్తూరు: తడుకు పంచాయతీ.. తిరుపతి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ పంచాయతీ పరిధిలోనే వేణుగోపాలసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీంతో వేణుగోపాలపురం, టీఆర్‌ కండ్రిగ కాలనీ, ఎస్టీ కాలనీలోని రైతులు తమ భూముల్ని ప్రాజెక్టులో భాగంగా కోల్పోయారు. నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో జీవనాధారం కోసం పాడిపై ఆధారపడుతున్నారు. ఆవులు, గేదెలను పోషించుకుంటూ సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పాడి రైతుల జీవితాలను అతలాకుతలం చేసే కష్టం వచ్చిపడింది. పాడి పశువులు ఒక్కొక్కటే వింతరోగంతో మృతి చెందుతుండడంతో ఏమి చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. వేలకు వేలు అప్పు చేసి కొనుగోలు చేసిన పశువులు కళ్లెదుటే మృత్యువాత పడుతుండడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.

కబళిస్తున్న వింత రోగం
భూములు కోల్పోయాక రైతులు పశుపోషణ ఒక్కటే జీవనాధారమైంది. దీంతో అప్పులు చేసి మరీ రైతులు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. గ్రామంలో ప్రస్తుతం వెయ్యికి పైగా పశువులు ఉన్నాయి. రెండేళ్లలో దాదాపు 40 పశువులు చనిపోయాయి. రెండు నెలలుగా వారానికి రెండు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల కథనం మేరకు.. ‘‘పశువులు ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మేత కూడా బాగానే తీసుకుంటున్నాయి. అయితే రాత్రికి రాత్రే అస్వస్థతకు గురవుతున్నాయి.

సమీపంలో ఉన్న పశువైద్యశాఖకు చెందిన అటెండర్‌కు సమాచారం అందిస్తే రెండు సెలైన్లు ఎక్కిస్తున్నారు.ఆ తరువాత కొంత సమయానికే మృతి చెందుతున్నాయి.. రోగమేమనేది అంతుచిక్కడం లేదు’’ అని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గేదెలు, ఆవులు ఉన్న పాడి రైతుకి ఇప్పుడు ఒక్కటి కూడా మిగలలేదని వాపోతున్నారు. కొనుగోలుకు చేసిన రుణం అలాగే ఉందని, పశువులు మాత్రం మృతి చెందుతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

గ్రామం ముఖం చూసి మూడేళ్లు
పశుసంపద ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామానికి పశువైద్యాధికారి వచ్చి మూడేళ్లుకు పైగా అవుతోందని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. ఏ రోగమొచ్చినా అటెండర్‌ దిక్కుగా మారారని పేర్కొంటున్నారు. ఇన్ని పశువులు మృతి చెందుతున్నా పశువైద్యశాఖ వైద్యులు గ్రామానికి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కేవలం పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇకనైనా పశువైద్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పుత్తూరు పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రమౌళి గౌడ్‌ వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

మరిన్ని వార్తలు