ఆదరించిన వారిపైనే తొలివేటు

19 Apr, 2015 02:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో : ఆదరించిన వారిపైనే తొలి వేటు పడింది. అధికార పార్టీకి అండగా నిలిచినందుకు ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన పరిస్థితి దాపురించనుంది. సీడ్ కేపిటల్ (తొలి దశ) కీలక నిర్మాణాలకు తమ గ్రామాలను ఎంపిక చేశారని తెలుసుకున్న వారంతా కలవరపడాల్సి వచ్చింది. ఉన్నపళంగా ఊరు, ఇళ్లు, గొడ్డూగోదా వదిలి పొమ్మంటే ఎలా అనే ఆందోళన వారి మదిని తొలిచేస్తోంది. ఇది రాజధాని ప్రాంతంలోని నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామస్తుల  దయనీయ స్థితి.
 
 వ్యూహాత్మకంగా
 ప్రభుత్వం అడుగులు..
 అబద్దాల పునాదులపై రాజధాని వ్యవహారాన్ని నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నేలపాడు నుంచి మొదలెట్టింది. సొంత సామాజికవర్గం, టీడీపీకి అనుకూలవర్గం అధికంగా ఉన్న ఈ గ్రామాల నుంచే ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తే ప్రజా వ్యతిరేకత లేకుండా తమ పని సజావుగా సాగుతుందన్నది ప్రభుత్వ ఎత్తుగడ. అనుకున్నట్టే ఆ నాలుగు గ్రామాల్లో భూ సమీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం సీడ్ కేపిటల్‌కు వాటినే ఎంపిక చేయడం ఆయా గ్రామాల ప్రజలకు మింగుడు పడటంలేదు. ఆ నాలుగు గ్రామాలనే ముందుగా ఖాళీ చేయించి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తామంటూ సీఆర్‌డీఏ వైస్ చైర్మన్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించడంతో కలకలం రేగుతోంది.
 
 తొలి దశలో పరిపాలన పరమైన కీలక నిర్మాణాలను చేపట్టి సీడ్ కేపిటల్‌గా అభివృద్ధి చేసేందుకు గ్రామాలను ఖాళీ చేయిస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనడంలో సందేహం లేదు. ఈ నాలుగు గ్రామాల్లోను ఉన్న సుమారు 6,714 మంది ఇల్లు వదిలిపోవాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టకుండా సీడ్ కేపిటల్ నిర్మించుకుంటే సరే.. లేకుంటే ప్రతిఘటనే అంటూ ప్రభుత్వానికి అక్కడి వారు అల్టిమేటం ఇస్తున్నారు.
 
 ఆ నాలుగు గ్రామాల్లో
 భూములు ఇలా...
  నాలుగు గ్రామాల్లోను రైతుల సొంత భూములు 5,601ఎకరాలు ఉండగా దాదాపు 5,450ఎకరాలను భూ సమీకరణ చేశారు. మిగిలిన గ్రామం కంఠం, అసైన్డ్‌భూములు, దేవాదాయ శాఖ భూములు ఎలాగు ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి. ఈ నాలుగు గ్రామాల్లోను ఒక్క వెలగపూడిలోనే కొంత మేర భూమి సమీకరణ పూర్తి కాలేదు. మిగిలిన మూడు గ్రామాల్లోను పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేయడం గమనార్హం.
 
 గ్రామాల వారీగా భూముల విస్తీర్ణం..
 నేలపాడులో రైతు సొంత భూములు 1,222 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 30, చెరువులు 42, అసైన్డ్ భూములు 40, గ్రామ కంఠం 9.5 ఎకరాలు ఉంది.
 
 ఐనవోలులో రైతు సొంత భూములు 1,046 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 9.32, వక్ఫ్ భూములు 21.25, చెరువులు 41.85, అసైన్డ్ భూములు 10.78, గ్రామ కంఠం 23.29, రోడ్లు, డొంకలు, పిల్ల కాలువలు 45.21ఎకరాలు ఉన్నాయి.
 
  శాఖమూరులో రైతుల సొంత భూములు 1,510 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 7, చెరువులు 27, అసైన్డ్ భూములు 36, గ్రామ కంఠం 14, రోడ్లు, డొంకలు, చిన్నపాటి కాలువలు 32 ఎకరాలు ఉన్నాయి.
 
  వెలగపూడిలో రైతుల సొంత భూమి 1,823 ఎకరాలు, దేవాదాయ శాఖ భూములు 33, అసైన్డ్ భూములు 37 గ్రామ కంఠం భూములు 19, కాలువలు, డొంకలు, రోడ్లు 85 ఎకరాలు ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు