రోగాల పుట్ట

11 Jul, 2015 00:17 IST|Sakshi
రోగాల పుట్ట

జిల్లాలో విజృంభిస్తున్న వ్యాధులు
గతేడాదితో పోలిస్తే ప్రమాదకరంగా పెరుగుదల
దోమల నివారణ  చర్యలు నామమాత్రం

 
విశాఖపట్నం: జిల్లా వాసులను రోగాలు పట్టిపీడుస్తున్నాయి. మైదానం, ఏజెన్సీ అనే తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే  దాదాపు 5వేల మంది మలేరియా బారిన పడ్డారు. 36 డెంగ్యూ, 11 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ ఉనికిని చాటుకుంటోంది. దాదాపు 4వేల మంది దీనికి గురయ్యారు. ఫైలేరియా  కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్నప్పటికీ ప్రభుత్వం, వైద్యఆరోగ్య శాఖ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. మలేరియా కారక దోమల నివారణ మందు  ఈ ఏడాది 2505 గ్రామాల్లో పిచికారీ చేయాలని ఆశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం 299 గ్రామాల్లోనే పిచికారీ  పూర్తి చేశారు. అధికారుల పోకడకు ఇది అద్దం పడుతోంది. జిల్లాలో వ్యాపిస్తున్న వ్యాధుల్లో మొదటి స్థానం మలేరియాదే. 2013లో జిల్లాలో ఈ కేసులు 5950 నమోదయ్యాయి. 2014కి ఆ సంఖ్య 8410కి చేరింది.

ఈ ఏడాది ఇప్పటి వరకూ (జూన్ నెలాఖరు నాటికి)4901 మంది మలేరియా బారిన పడ్డారు. వీటిలో ఏజెన్సీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అక్కడ 2013లో 2414 మందికి, 2014లో 5250 మందికి, ఈ ఏడాది 3948 మందికి మలేరియా సోకింది. రూరల్ ఏరియాలో 366, అర్బన్ ఏరియాలో 587 మలేరియా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. తర్వాత స్థానంలో టైఫాయిడ్ ఉంది. ఈ ఏడాది దాదాపు 4వేల మందికి ఈ వ్యాధి సోకింది. ఇప్పటివరకూ జిల్లాలో 256 మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా వారిలో 36 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది. 147 రక్త నమూనాల పరీక్షల్లో 11 మందికి చికెన్‌గున్యా కనిపించిం ది. ఫైలేరియా ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ గతేడాది 7 కేసులు, ఈ ఏడాది 2 కేసులు వెలుగుచూశాయి. రోగాలు ఇంత దారుణంగా వ్యాపిస్తున్నటికీ వైద్య, ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని హ్యూమన్‌రైట్స్ ఫోరం పరిశోధనలో వెలుగుచూసింది. ఇటీవల ఫోరం సభ్యులు ఏజెన్సీలోని 9 మండలాల్లో పర్యటించినప్పుడు దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి.

ఉత్తరాంధ్రలో 1999లో 4500 మంది గిరిజనులు మలేరియాతో చనిపోయారు. 2005, 2010 మధ్య వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలుషిత తాగునీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, దోమల నుంచి రక్షణ లేకపోవడం, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారని పలు అధ్యయనాలు నిరూపించాయి. ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా అధికారులు, పాలకులు కళ్లు తెరవడం లేదు.
 
 

మరిన్ని వార్తలు