సీపీఎస్‌ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు

1 Feb, 2019 01:59 IST|Sakshi

అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయుల యత్నం

బ్యారేజీపైనే ఉద్యోగుల బైఠాయింపు

మూడు గంటలపాటు ఉద్రిక్తత.. భారీగా స్తంభించిన ట్రాఫిక్‌ 

ఉద్యోగుల ఆందోళనతో సర్కారు, పోలీసులకు ముచ్చెమటలు

పెద్దఎత్తున మోహరించి భగ్నం చేసిన పోలీసులు

ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం

సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్‌  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు రాజధాని విజయవాడలో కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. విజయవాడ నుంచి అమరావతికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయ అధికారులు వెళ్లే ప్రధాన మార్గమైన ప్రకాశం బ్యారేజ్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. ఊహించని రీతిలో ఉద్యోగులు ప్రకాశం బ్యారేజ్‌పైకి చేరుకోవడంతో ప్రభుత్వానికి, పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. మూడు గంటలపాటు బ్యారేజీపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులకు నానా అవస్థలు పడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వారికి నాలుగు గంటల సమయం పట్టింది. గంటపాటు భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో ఉద్యోగులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించి అరెస్టుచేశారు. సీపీఎస్‌ను రద్దు చేసేవరకు పోరాడతామంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,86,000 మంది ఉద్యోగస్తులు సీపీఎస్‌వల్ల రోడ్డున పడే ప్రమాదముందని.. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 653, 654, 655 జీఓలను వెంటనే రద్దుచేసి, పాత పెన్షన్‌ పద్ధతిని అమలుచేయాలని అరెస్టయిన నాయకులు డిమాండ్‌ చేశారు. 

ప్రకాశం బ్యారేజ్‌పై మెరుపు ధర్నా  
అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్‌ మీటింగ్, టీటీడీ శ్రీవారి ఆలయం భూకర్షణ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు గురువారం ఉండటం, ఒక్కసారిగా బ్యారేజ్‌పై ఉద్యోగులు ఆందోళనతో అమరావతికి బయల్దేరడంతో పోలీసులు కంగారు పడ్డారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతిలేదంటూ వారిని అడ్డుకునేందుకు  ప్రయత్నించారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్‌–30తో పాటు 144 సెక్షన్లు అమలులో ఉన్నాయంటూ హెచ్చరించారు. అయినా, ఫలితం లేకపోవడంతో ఉద్యోగులను అరెస్టుచేసి వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయినా, అరెస్టులను ఛేదించుకుంటూ వందలాది మంది ఉద్యోగులు ప్రకాశం బ్యారేజ్‌పైకి చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు బ్యారేజ్‌ పైనే నినాదాలు చేస్తూ బైఠాయించారు. గంటపాటు ఎంత ప్రయత్నించినా వినకుండా అక్కడే కూర్చోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో నిత్యం సీఎం ప్రయాణించే బస్సు కూడా నిలిచిపోయింది. ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు దానిచుట్టూ వలయంలా ఏర్పడ్డారు. అలాగే, ధర్నా కారణంగా రాజధాని వైపు వెళ్లాల్సిన వందలాది వాహనాలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం చర్చలకు పిలిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ అక్కడే భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎక్కించి అరెస్టుచేశారు. అరెస్టయిన వారిని గవర్నర్‌పేట, భవానీపురం, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, తాడేపల్లి తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా ర్యాలీగా వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి, తమ హక్కులను కాలరాస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేశారని విమర్శించారు. 

వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం
ఇదిలా ఉంటే.. ఉద్యోగులను అరెస్టు చేయటాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ నాయకులు మల్లాది విష్ణు, పి గౌతంరెడ్డిలు విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అరెస్టయిన ఉద్యోగులను కలిసి వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సీపీఎస్‌ ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారిపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు