కాటేసిన విద్యుత్ తీగ

27 Jun, 2015 03:40 IST|Sakshi
కాటేసిన విద్యుత్ తీగ

ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం  విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.    
- ఎస్వీయూలో విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి
- మరో ఉద్యోగి పరిస్థితి ఆందోళనకరం
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన
యూనివ ర్సిటీ క్యాంపస్ :
ఎస్వీ యూనివర్సిటీలో విద్యుదాఘాతంతో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... ఎస్వీయూలోని టెన్నిస్ కోర్టు వద్ద శుక్రవారం వీధిలైట్ వెలగకపోవడంతో రిపేరు చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడి హెల్పర్లు, టైమ్ స్కేల్ ఉద్యోగులైన మురళి, జగదీష్‌ను ఆదేశించారు. వారి ద్దరూ విద్యుత్ సరఫరా ఆఫ్ చేసి ఆపై  స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఇంతలో మురళి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

పక్కనే ఉన్న జగదీష్(38) అతన్ని రక్షించబోయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడిపోయాడు. ఆపై కొంతసేపటికే గిలాగిలా కొట్టుకుంటూ జగదీష్ ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మురళిని స్విమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. జగదీష్ మృతదేహాన్ని నిచ్చెన నుంచి అతి కష్టంమీద కిందికి దింపారు.  ఇలావుండగా మురళి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
 
ఆ నిర్లక్ష్యమే కారణమా?
ఎస్వీయూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది భావిస్తున్నారు. 13న ఎస్వీయూ స్టేడియంలో బాహుబలి ఆడియో వేడుకకు ఎస్వీయూ నుంచి 11 కేవీ విద్యుత్ లైను నుంచి కనెక్షన్ ఇచ్చారు. ఫంక్షన్ అనంతరం దానిని తొలగించలేదు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు మరిచిపోయారు.  మరమ్మతుల సమయంలో సిబ్బంది కరెంట్ ఆఫ్ చేసినా స్టేడియం నుంచి వచ్చే వైర్‌కు విద్యుత్ రావడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
 
ఉద్యోగుల ఆందోళన
మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో, కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం పరిపాలనా భవనం వద్ద జగదీష్ మృతదేహంతో ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్రమణ్యంరెడ్డి, మధుసూదన్‌నాయుడు, ఎన్ ఎంఆర్‌ల అధ్యక్షుడు నాగవెంకటేశ్, వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హే మంతకుమార్, మురళీధర్ పాల్గొన్నారు.
 
రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా

జగదీష్ కుటుంబాన్ని ఆదుకుంటామని వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ జయశంకర్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా, జగదీష్ భార్యకు టైంస్కేల్ ఉద్యోగాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు