ఇంత ‘పచ్చ’పాతమా?

1 Jun, 2019 11:30 IST|Sakshi

సీపీఎస్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసినందుకు ఉద్యోగి సస్పెన్షన్‌

టీడీపీ తరపున ప్రచారం చేస్తే పట్టించుకోని అధికారులు

ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్న కలెక్టర్‌

అధికారుల వైఖరిపై మండిపడుతున్న ఉద్యోగవర్గాలు

ఈ ఫొటోను బాగా పరిశీలించండి. ఇక్కడ ప్రచారం చేస్తున్న వ్యక్తి మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున కదిరి నియోజకవర్గ బరిలో నిలిచిన అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌. ఆయన పక్కనే కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధాకర్‌ యాదవ్‌. ఈయన వయోజన విద్య కదిరిని నియోజకవర్గ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇలా బాహాటంగానే టీడీపీ తరుఫున ప్రచారం చేశాడు. సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు రావడంతో విచారించి సస్పెన్షన్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీరపాండియన్‌ సిఫార్సు చేశారు. కానీ నేటికీ ఆయనపై కనీస చర్యలు లేవు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఓ వైపు ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీని హర్షిస్తూ మాట్లాడిన ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. మరో పక్కేమో ఏకంగా టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఉద్యోగిపై కనీస చర్యలు తీసుకోకుండా అధికారులు ద్వంద వైఖరి అవలంభించడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుపడుతున్నాయి. టీడీపీకి కొందరు అధికారులు ఏకపక్షంగా పని చేశారనేందుకు ఈ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తోంది.

రిటర్నింగ్‌ అధికారి వద్దే బ్రేక్‌
టీచరుగా పని చేస్తున్న సుధాకర్‌యాదవ్‌ వయోజన విద్యశాఖకు బదిలీ అయి అక్కడ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రిటర్నింగ్‌ అధికారి కూర్మనాథ్‌... డీఈఓకు సిఫార్సు లేఖ పంపారు. సదరు ఉద్యోగి తమశాఖలో లేరని ప్రస్తుతం పని చేస్తున్న వయోజన విద్య డీడీకి డీఈఓ ఉత్తర్వులు పంపారు. వయోజన విద్య డీడీకి సస్పెండ్‌ చేసే అధికారం లేకపోవడంతో తిరిగి రిటర్నింగ్‌ అధికారి కూర్మనాథ్‌కు వివరణ లేఖ ఇచ్చారు. సుధాకర్‌యాదవ్‌ తమ శాఖలోనే పని చేస్తున్నాడంటూ లేఖలో స్పష్టం చేశారు. అంతే ఈ తతంగం అంతటితో ఆగిపోయింది.  

‘కందికుంట’ ఒత్తిళ్లు
టీడీపీ అధికారంలో ఉండటంతో కందికుంట వెంకటప్రసాద్‌ ఆర్‌ఓ కూర్మనాథ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. సుధాకర్‌యాదవ్‌ మరో పదిమంది వచ్చి నేరుగా ఆర్‌ఓతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇక్కడితో ఆగిపోయాయి. దీని వెనుక కొందరి మధ్య డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీరపాండియన్‌ దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

వయోజన విద్య డీడీ రమణ ఏమంటున్నారంటే...
సుధాకర్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఈఓ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. సస్పెన్షన్‌ చేసే అధికారం లేకపోవడంతో సదరు ఉద్యోగి మా శాఖలోనే పని చేస్తున్నారంటూ ధ్రువీకరిస్తూ రిటర్నింగ్‌ అధికారికి లేఖ ఇచ్చాను. ఏమి జరిగిందో ఏమో నాకు తెలీదు. సుధాకర్‌యాదవ్‌ను మాత్రం సస్పెండ్‌ చేయలేదు. 

మరిన్ని వార్తలు