మేమేం చేశాం.. పాపం

19 Nov, 2014 03:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానంలో అన్యా యం జరిగింది. అవార్డులు కాదు కదా కనీసం సోమవారం రాత్రి వుడా పార్కు ఆవరణలో జరిగిన అభినందన సభకు ఆహ్వానం కూడా రాలేదు. దీనిపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ శాఖలైన మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమలు తదితర శాఖలను పూర్తిగా విస్మరించారంటూ ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తుపాను సమయంలో కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజల కోసం రేయింబవళ్లు శ్రమించామని, అయినా తమను గుర్తించకపోవడం బాధిస్తోందని వారు కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ ఎన్జీవో సంఘ నేతలు చెప్పిన సంఘాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని, తాము కూడా గెజిటెడ్ ఉద్యోగులమేనని వ్యవసాయ శాఖాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కూడా అవార్డుల ప్రదానంలో ఇదే రీతిలో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ వారు వాపోయారు. ఈసారి అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగురీతిలో గౌరవిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు