పీఆర్‌సీ వేయాలని 28న విద్యుత్ ఉద్యోగుల మాస్ ధర్నా

25 Jan, 2014 00:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 2014 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి రావాల్సిఉన్నా ఇప్పటి వరకు కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేయలేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. ఇందుకు నిరసనగా 28వ తేదీన విద్యుత్ సౌధలో మాస్ ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో-చైర్మన్ జి. మోహన్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మొత్తం 14 విద్యుత్ ఉద్యోగుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడినట్టు తెలిపారు.

 

28 నాటికి కూడా కమిటీ వేయకపోతే అప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని, దానిని ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం చెబుతోందన్నారు. నవంబర్‌లోనే వేతన సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో నిర్వాహక కార్యదర్శి ఎన్.కిరణ్, సహ కార్యదర్శి ఎంఏ వజీర్, చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు