విలీనానందం

4 Sep, 2019 10:40 IST|Sakshi

దశాబ్దాల కల నెరవేతున్న వేళ

కమిటీ నివేదికతో ఆర్టీసీ కార్మికుల హర్షం

మేమూ ప్రభుత్వ ఉద్యోగులమేనంటూ ఆనందం

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసిం ది. నిపుణుల కమి టీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రి జగన్‌ బుధవారం అధికారికంగా ఆర్టీసీ విలీనాన్ని ప్రకటిస్తుండడంతో కార్మికసంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..
రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాల్లోంచి గట్టెక్కాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని నాటి నాటి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు పద్మాకర్‌ సూచించారు. నాటి నుంచి ఈ విషయంలో కార్మిక వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. సంకల్ప యాత్రలో భాగంగా ఈ సమస్యను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లోనే విలీనం చేస్తామన్నారు. అనుకున్నట్టే హామీ నిలబెట్టుకుంటున్నారు. ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోం.
– కేజే శుభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఎంప్లాయిస్‌ యూనియన్‌

సీఎం నిర్ణయం అభినందనీయం..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయం  అభినందనీయం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహోసపేత నిర్ణయంపై కార్మిక వర్గాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. 
– అల్లు సురేష్‌నాయుడు, రీజనల్‌ కార్యదర్శి, విశాఖ రీజియన్‌ 

సాహసోపేత నిర్ణయం..
ఏపీఎస్‌ ఆర్టీసీని కార్పొరేషన్‌ స్థాయి నుంచి ప్రభుత్వంలోనే విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి యావత్‌ ఆర్టీసీ కార్మిక వర్గం రుణపడి ఉంటుంది. విశాఖ రీజనల్‌ పరిధిలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, రీజనల్‌ పరిధిల్లో నష్టాలను, ఆస్తులను గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు అధ్యయనం చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంకాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో మా చిరకాల కోరిక నెరవేరబోతోంది. విలీనం కోసం ఎన్‌ఎంయూ చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
– ఏకే శివాజి, అర్బన్‌ డివిజన్‌ కార్యదర్శి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌

శుభపరిణామం..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం శుభపరిణామం. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. విలీనం కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రయోజనాలు చేకూరతాయి. 
– జీపీ రావు, ప్రచార కార్యదర్శి, వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్‌

జగన్‌కు రుణపడి ఉంటాం..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంగళవారం సాయంత్రం పలు టీవీ చానల్లో వస్తున్న స్క్రోలింగ్‌ చూసి ఎంతో సంబరపడ్డాను. కేబినెట్‌ తొలి సమావేశంలోనే ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేయడం. ఆ కమిటీ మూడు నెలల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయడం, ఆపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం ప్రతి కార్మికుడు, ఉద్యోగి సంతోషపడ్డ విషయమే. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే.  ప్రతి కార్మికుడు, ఉద్యోగి జగన్‌కు రుణపడి ఉంటాం.
– బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ

మా కల నిజమవుతోంది..
ఎప్పుడూ నష్టాల పేరిట మా శ్రమను దోచుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ హయాంలో పనిచేయడం వింటుంటే కలా..నిజమా అనిపిస్తోంది. మా కలను ముఖ్యమంత్రి నెరవేర్చారు. కొండంత అప్పుల్లో మునిగి ఉన్న ఆర్టీసీ ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రగతిబాటలో నడవడం ఖాయం. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమనే ఫీలింగ్‌ గొప్పగా ఉంది.  పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు.
– కేఎస్‌ఎస్‌ మూర్తి, సహాయ కార్యదర్శి, విశాఖ రీజియన్‌ 

మరిన్ని వార్తలు