ఆర్టీసీ విలీనం : అంబరాన్ని తాకిన కార్మికుల సంబరాలు

5 Sep, 2019 18:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీసుకున్న సంచనలన నిర్ణయం పట్ల  ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.  దశాబ్దాల కల సాకారమయిదంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో  ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేసినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఈయూ నాయకులు వలిశెట్టి దామోదరరావు(వైవీ రావు), ఎన్‌ఎమ్‌యూ నాయకులు వై శ్రీనివాసరావు, ఏ విష్ణు రెడ్డి, ఏ సుధాకర్‌, వెంకటరమణ తదితరులు ఉన్నారు. 

విజయవాడలో ఈయూ నేతల సంబరాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబరాలు చేశారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ  బస్టాండ్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పుష్పార్చన చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీనంతో పాటు ఆర్టీసీలోని ఇతర సమస్యలు, తమకు దక్కాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. 

సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం
ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మచిలీపట్నం ఈయూ సంఘ నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. 


తిరువూరులో ఆర్టీసీ కార్మికుల సంబరాలు
సీఎం వైఎస్‌ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల కృష్ణా జిల్లా  తిరువూరు ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల తమ కల నెరవేరిందంటూ ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలీనాన్ని హర్షిస్తూ సీఎం జగన్‌, రవాణా మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కే.రక్షణనిది చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. 

తిరుపతిలో..
ఆర్టీసీ ఉదోగుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల తిరుపతిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువనేత భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు అన్నారు. 

నెల్లూరులో..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఎంఎంయూ నేత రమణ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి  పూలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట ఇస్తే నిలబెట్టుకొంటారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. 

చిత్తూరులో..
ఆర్టీసి విలీనాన్ని హర్షిస్తూ మదనపల్లిలో ఎమ్మెలే​ నవాబ్‌ బాషా సమక్షంలో ఆర్టీసీ కార్మికులు బారీ కేక్‌ను కట్‌ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

విశాఖలో.. 
ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చేస్తూ కాబినెట్ ఆమోదముద్ర వేయడంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్ర పటానికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. 

గుంటూరులో..
విలీనాన్ని హర్షిస్తూ మాచర్ల ఆర్టీసీ కార్మికులు  సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. 

విజయనగరంలో..
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

మరిన్ని వార్తలు