గళమెత్తిన ఉద్యోగులు

29 Dec, 2018 13:18 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులు

సీపీఎస్‌ రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి

ధర్నాలో పలు సంఘాల నాయకుల డిమాండ్‌

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సమస్యల సాధన కోసం పలు శాఖలకు చెందిన ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద గళమెత్తారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయటంతోపాటు సమస్యలను పరిష్కరించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మణికుమార్‌ మాట్లాడుతూ 30 నుంచి 35 సంవత్సరాల విధి నిర్వహణలో ఉద్యోగులకు బీపీ, షుగర్‌ తప్ప ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి చేయూతను అందిస్తుంటే కష్టాలను మాత్రం పట్టించుకోకుండా మిన్నకుండి పోతున్నారన్నారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్‌ ఉల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వం ఇంత వరకు వాటిని పరిష్కరించలేదన్నారు. పింఛనుదారులకు క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛన్‌ను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ వారిని క్రమబద్ధీకరించాలని కోరారు.

వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే సమ్మె ద్వారానైనా సమస్యలను సాధించుకుంటామన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ నాయకుడు శోభన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను రోడ్డు పాలు చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలపాటు బీజేపీ ప్రభుత్వ సహకారంతో పాలన చేసి ఇప్పుడు నిధులు ఇవ్వకపోవటంతో ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని ప్రకటిస్తున్న పాలకులు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించకుండా మోసం చేస్తోందన్నారు. యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు కేఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్టీయూ నాయకుడు కొమ్ము ప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలోనే ఉద్యోగులు రోడ్డు మీద పడతారన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు వివిధ ఉద్యోగ సంఘాలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ధర్నా కార్యక్రమంలో తూర్పు జేఏసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లెనిన్‌బాబు, జీవీఎస్‌ పెరుమాళ్లు, తమ్ము నాగరాజు, మహంకాళరావు, జేఏసీ మహిళా విభాగం కన్వీనర్‌ కె గౌరి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, ఈవీ రామారావు, పీవీ సాయికుమార్, జీటీవీ రమణ, విజయ్‌కుమార్, బాబాప్రసాద్, బి భానుమతి, బీటీఏ సంఘ నాయకులు మట్టా రాజేష్, టి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు