ఎన్నికల విధులకు పంపిస్తే ఓటెలా వెయ్యాలి?

10 Apr, 2019 04:33 IST|Sakshi
విజయవాడ మున్సిపల్‌ కార్యాలయంలో హెల్త్‌ అధికారి చాంబర్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు

పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కూడా కల్పించడంలేదని ఆవేదన

సాక్షి, అమరావతి: మమ్మల్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఎన్నికల డ్యూటీకి వేశారు.. మరి ఓటు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అని పలువురు ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా ఆశా వర్కర్లు, ఫార్మసిస్ట్‌లు, ఎంపీహెచ్‌ఏలతో పాటు పలువురు మున్సిపల్‌ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కనీసం వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానైనా ఓటు వేసే అవకాశం కల్పించకుండా ఆదేశాలిచ్చారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఆశా వర్కర్లే 42 వేల మంది ఉన్నారు. ఇక ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఏలే 8 వేల మందిపైనే ఉన్నారు. వీళ్లందరికీ ఎన్నికల విధులకు వెళ్లాలని ఈనెల 8వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రస్తావనే లేదు.

ఈ ఆదేశాలు చూసిన ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లకోసారి తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అవకాశమొస్తే ఇలా కనీసం పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు మంగళవారం విజయవాడ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి నిరసన చేపట్టారు. ఎన్నికల విధులకు వెళ్లడానికి అభ్యంతరం లేదని, తమకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించి తీరాలని పట్టుపడుతున్నారు.

ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే విధులకు వెళతామని భీష్మించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అరవపాల్‌ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మున్సిపల్‌ అధికారులను కలిశారు. ఓటు వేసుకోవడానికి వీలు లేకుండా ఎన్నికల విధులకు వేసి, ఇలా చేయడం సరైనది కాదని, పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కల్పించాలని విన్నవించగా ఎన్నికల విధులకు సరిపడా సిబ్బంది లేరని, మీరే వేరొకరిని ఏర్పాటు చేయండి.. అంటూ సమాధానమిస్తున్నారని అరవపాల్‌ సాక్షితో చెప్పారు.

మరిన్ని వార్తలు