హాజరు ఒత్తిడి

30 Oct, 2017 08:55 IST|Sakshi

తణుకు టౌన్‌: బయోమెట్రిక్‌ హాజరు పలు ప్రభుత్వ శాఖల్లోని  క్షేత్ర స్థాయి ఉద్యోగులకు సంకటంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఏఎన్‌ఎంలకు ఈవిధానం అమలు చేయవద్దని ఆశాఖ కమిషనర్‌ ఆదేశించినా జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పని చేసే ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లుగా పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్‌ సెంటర్ల్‌లో పని చేసే వైద్య సిబ్బందిలో ఎక్కువ మంది ఫీల్డ్‌ వర్క్‌ చేసే వారే. వారిలో ఆరోగ్య కార్యకర్తలు, పురుష, మహిళా కార్యకర్తలు ఎక్కువగా వున్నారు.

 జిల్లాలో మొత్తం 81 పీహెచ్‌సీలు, వాటికి అనుబంధంగా 680 ఆరోగ్య ఉప కేంద్రాల్లో సుమారు 800 మంది ఏఎన్‌ఎంలు, 200 మంది సూపర్‌వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా వారి పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణిలకు వ్యాక్సిన్‌లు వేయటం, గర్భిణిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి యోగ క్షేమాలను రికార్డు చేసి పీహెచ్‌సీ వైద్యాధికారికి నివేదించాలి. అయితే వీటిలో ఎక్కువ రిస్క్, అత్యవసర సేవలు అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. ఈ క్రమంలో గర్భిణిలను జిల్లాలోని వివిధ ఏరియా ఆసుపత్రులకుకానీ,  ఏలూరు, కాకినాడలలోని జనరల్‌ ఆసుపత్రులకుగానీ కేసులను రిఫర్‌ చేసినప్పుడు సంబంధిత ఏఎన్‌ఎంలు బయోమెట్రిక్‌ హాజరే వేసుకోవాలా? రోగి కూడా వెళ్లాలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 బయోమెట్రిక్‌ హాజరు విధానం ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినా సర్వర్లు సరిగా పనిచేయక పోయినా, పంచాయతీ సిబ్బంది సరిగా స్పందించకపోయినా గంటల తరబడి బయోమెట్రిక్‌ యంత్రాల వద్ద పడిగాపులు కాయవలసి వస్తోందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పని చేసే గ్రామంలో మాత్రమే బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ గ్రామంలో సర్వర్లు పని చేయకపోతే పక్క గ్రామంలో గానీ, పీహెచ్‌సీలోగానీ బయోమెట్రిక్‌ హాజరు వేసేవారు. ప్రస్తుత నిబంధనలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. రోగికి అత్యవసర వైద్యం కోసం బయటకు వెళ్తే ఆరోజుకు హాజరు లేనట్లేనని పేర్కొంటున్నారు.  

రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు
వీఆర్వో, సర్వేయర్, డిప్యూటి తహసీల్దార్, తహసిల్దార్‌కు బయోమెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపునిస్తూ వారం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నిబంధనలు కఠినం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్ర స్థాయి సిబ్బందిని మినహాయించాలి
బయోమెట్రిక్‌ హాజరు నుంచి వైద్య ఆరోగ్య శాఖలోని క్షేత్ర స్థాయి ఉద్యోగులను ముఖ్యంగా ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్లకు మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే వారిపై అనేక పని భారాలు మోపారు.  క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులు రోగులకు సేవలందించాలో, బయోమెట్రిక్‌ హాజరు కోసం వేచి చూడాలో తెలియక సతమతమవుతున్నారు.
– కె.జయమణి, జిల్లా అధ్యక్షులు,
వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంఘం

మరిన్ని వార్తలు