ఏవీ బదిలీలు... ?

10 Jun, 2015 00:07 IST|Sakshi

 సమయం మించిపోతోందంటూ ఉద్యోగుల గగ్గోలు
 రోజుకో జీవోతో గందరగోళంగా ఉందని ఆవేదన
 పాఠశాలలు తెరిచేస్తున్నా
 తేల్చకపోవడంపై అసహనం

 
 శ్రీకాకుళం సిటీ :బదిలీలు ఎప్పుడు జరుగుతాయి?... అసలు జరుగుతాయా లేదా?... కొత్తజీవోలు ఏమైనా వచ్చాయా?... అందులో ఏమైనా కొత్త నిబంధనలున్నాయా?... మరో వారం రోజుల్లో బడులు తెరిచేస్తారు... ఇప్పటికీ తేల్చకపోతే... మన పరిస్థితి ఏమిటి? - ఇదీ ప్రస్తుతం ఉద్యోగుల్లో నెలకొన్న చర్చ. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బదిలీల ప్రక్రియ చేపట్టేటప్పుడు తప్పనిసరిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిని, ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలి. తొలి విడత గత నెల 31లోగా ఈ జిల్లాలో బదిలీల తంతు పూర్తిచేయాలని భావించాం. కానీ జూన్ 9వ తేదీ నుంచి 15 వరకు గడువు పొడిగించాం.
 
 ఇదీ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాటలు
 మొత్తమ్మీద జిల్లాలో బదిలీల వ్యవహారం ఉద్యోగుల్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇంతవరకూ దీనిపై ఏ విధమైన ప్రకటనా స్పష్టంగా లేకపోవడం... జాబితాలు తయారు కాకపోవడంపై వారంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 24 వేలకు పైగానే ఉన్నారు. ప్రతీశాఖలో 20శాతానికి మించకుండా బదిలీల ప్రక్రియ చేపట్టాలని తొలుత ప్రభుత్వం యోచించింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 15వేల మందికి పైగా ఉన్నారని తెలియవచ్చింది. ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులకు తొలుత ప్రభుత్వం సూచించింది. కానీ తాజాగా బదిలీల ప్రక్రియకు రాజకీయరంగు పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆయా ప్రభుత్వశాఖల అధికారులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కూడా ఈ కమిటీలో బాగస్వామ్యం చేసింది. ఈ కమిటీ నిర్ణయం పైనే బదిలీలు జరుగుతాయి.
 
 సాధారణంగా ఎన్నికలపుడు మినహా మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా మే నెలలో ఒక్కసారే బదిలీలు చేసేవారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సర్కారు ఏర్పాటైన ఏడాదిలోనే రెండు పర్యాయాలు బదిలీల ప్రక్రియ చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బదిలీల్లో ఖజానా, విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అవకాశం లభించలేదు. ఈ సారి కూడా ఖజానా, ఆడిట్ శాఖలను మినహాయించారు. ఉపాధ్యాయుల బదిలీలపై ఇంతవరకు స్పష్ట్టత లేకపోవడంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. మరో వారంలోగా పాఠశాలలు తెరవబోతున్న నేపథ్యంలో బదిలీలు చేయడం సరికాదనేది వారి వాదన.
 
 రకరకాల జీవోలతో గందరగోళం
 పుట్టగొడుగుల్లా వస్తున్న జీవోలతో జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. గతనెలలో జీవోలు 57, 58, 59, 60తో పాటు మరికొన్ని వచ్చినట్లు పేర్కొంటున్నారు. తొలుత మే 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో బదిలీలకు తుదిగడువుగా సర్కారు నిర్ణయించినా జూన్ 3వ తేదీ నుంచి 7 వరకు జిల్లాలో చేపట్టిన జన్మభూమి-మాఊరులో అధికారులను బాగస్వామ్యం చేయదలచి తాత్కాలికంగా వాయిదా వేసింది. జూన్ 9వ తేదీ నుంచి 15 వరకు బదిలీలకు తేదీలను నిర్ణయించింది. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనమండలి సభ్యుల(ఎంఎల్‌సీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
 మంగళవారం ఎంఎల్‌సీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి వచ్చేనెల 7వ తేదీ కౌంటింగ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో కోడ్‌ను అమలు చేయాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎంఎల్‌సీ ఎన్నికలు జరగకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎంఎల్‌సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో ఈ నిబంధనలను వర్తింపజేసింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ కోడ్ అవరోధంగా నిలిచింది. మొత్తమ్మీద బదిలీల వ్యవహారం తేలక ఉద్యోగులు తర్జనభర్జన పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు