వేటు మొదలైంది.. 

19 Jan, 2020 08:36 IST|Sakshi

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల ఎఫెక్ట్‌  

అధికారులను  కదిలించిన ‘సాక్షి’ కథనాలు  

తనిఖీలు చేపట్టేసరికి బయటపడ్డ వాస్తవాలు  

మిల్లర్ల రికార్డుల తనిఖీల్లో వీఆర్వోల నిర్లక్ష్యం 

నిర్ధారణ కావడంతో ఇద్దరి సస్పెన్షన్‌  

మిల్లుల ట్యాగింగ్‌లో  అడ్డగోలుగా వ్యవహరించిన సీనియర్‌ అసిస్టెంట్‌పైనా వేటు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై వేటు మొదలైంది. తొలుత ఇద్దరు వీఆర్వోలను, జిల్లా పౌరసరఫరాల కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. అక్రమాలను ప్రోత్సహించేలా చోద్యం చూశారని వీరిపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. తేమ శాతం తక్కువ ఉందని, 1075 రకాన్ని మద్దతు ధరకు తీసుకోమని చెప్పి తక్కువ ధరకు తీసుకున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అలాగే ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల్లో బినామీ రైతుల పేరున ఆన్‌లైన్‌ చేసి ప్రభుత్వ మద్దతు ధరను కొట్టేశారు. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కానీ వీఆర్వోలు పట్టించుకోలేదు. మిల్లర్లకు పరోక్షంగా సహకరించారు. ప్రత్యేక అధికారుల తనిఖీల్లో వీరి నిర్లక్ష్యం, నిర్వాకం బయటపడింది. దీంతో సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ వారిపై సెస్పెన్షన్‌ వేటు వేశారు.

కలెక్టర్‌ ఆదేశాలతో కదలిక 
రైతుల గోడును కళ్లారా చూశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని రైతుల నోట నుంచి విన్నారు. పండించిన ధాన్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇక్కట్లను దగ్గరుండి గమనించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు వ్యవహారాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఎంత పకడ్బందీగా వ్యవహరించినా పరిస్థితిలో మార్పు రాలేదని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు సైతం ప్రతిష్టాత్మకంగా భావించారు. అధికారులందరినీ పరుగులు తీయించారు. అక్రమాలకు పాల్పడినా, ధాన్యం తీసుకోవడానికి వెనకడుగు వేసినా మిల్లులు సీజ్‌ చేసే అధికారాన్ని ఇచ్చారు. మిల్లుల వద్ద వీఆర్వోలను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆర్‌ఐలను నియమించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొందరు మిల్లర్లు దారికొచ్చారు. ఫలితంగా కొనుగోళ్లు కొంతమేరకు వేగవంతమయ్యాయి.

మిల్లర్ల రికార్డుల తనిఖీల్లో నిర్లక్ష్యం 
కలెక్టర్‌ అప్పగించిన బాధ్యతలను క్షేత్రస్థాయి సిబ్బందిలో కొందరు సరిగా నిర్వర్తించలేదు. కొందరు వీఆర్వోలు మిల్లులను తనిఖీలు చేయకుండా పరోక్షంగా అక్రమాలకు సహకరించారు. ధాన్యానికి సంబంధించి మిల్లర్లు రెండు రికార్డులు నిర్వహించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం కోసం ఒక రికార్డు, నేరుగా రైతుల నుంచి (ప్రైవేటుగా) కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మరో రికార్డును మిల్లరు చూపించాలి. కానీ తమకు వచ్చే లాభాలు పోతాయన్న ఉద్దేశంతో జిల్లాలో చాలామంది మిల్లర్లు రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదు. ప్రైవేటుగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎంత ధరకు తీసుకున్నారన్నది ఇట్టే తెలిసిపోతుంది. అదే జరిగితే మిల్లర్ల అక్రమాలు దాదాపు బయటపడతాయి. కానీ కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు మిల్లర్ల వద్ద ఉండే రికార్డులను పరిశీలించడం లేదు. దీంతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్ద తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆ ధాన్యాన్నే రైతుల వద్ద ఎంఎస్‌పీకి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఆన్‌లైన్‌ చేయించుకుంటున్నారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇవన్నీ కలెక్టర్‌ దృష్టికి వచ్చాయి. ప్రత్యేక అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నివేదించారు. కొందరు వీఆర్వోలు కలెక్టర్‌ ఆదేశాలను పెడచెవిన పెట్టిన విషయం బయటపడింది.

సస్పెన్షన్ల పర్వం 
మిల్లుల రికార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో పొందూరు మండలం కనిమెట్ట వీఆర్వో పి.రంగారావు, వీఆర్‌ గూడేనికి చెందిన వీఆర్వో జి.వెంకటరమణలను సస్పెండ్‌ చేశారు. ఆరోపణలు రావడంతో డీఎస్‌ఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అనంత్‌ను తొలుత సీటును నుంచి  తప్పించారు. శాఖాపరమైన విచారణ చేపట్టి మిల్లుల అడ్డగోలు ట్యాగింగ్‌లో ఆయన పాత్ర ఉన్నట్టు తేలిన అనంతరం సస్పెన్షన్‌ వేటు వేశారు. పోలాకి మండలంలోని రాళ్ళపాడు గ్రామంలో ఉన్న శ్రీవెంకటసిరి ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ శ్రీరామకృష్ణ మోడరన్‌ రైస్‌మిల్‌కు 3269 క్వింటాళ్ల మేరకు అర్హత ఉంది. ఆ మిల్లును ఈదులవలసలో వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ట్యాగ్‌ చేశారు. అక్కడ రికార్డుల ప్రకారం 240 క్వింటాళఉ్ల మాత్రమే వెలుగు సిబ్బంది కొనుగోలు చేసి మిల్లుకు పంపించారు. అయితే సదరు మిల్లు యజమాని మాత్రం రాత్రికి రాత్రి నరసన్నపేటలోని ఒక కొనుగోలు కేంద్రం ద్వారా మొత్తం ధాన్యం తెప్పించుకున్నట్టుగా ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. దానితో ఈదులవలస కొనుగోలు కేంద్రం పరిధి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ససేమిరా అన్నారు.

దీనిని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారులు అప్రమత్తమై ఆరా తీయగా.. జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జరిగిన కుమ్మక్కు వ్యవహారమే కారణమని తేలింది. ఇక్కడ సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన అనంత్‌ ముందురోజు రాత్రి అడ్డగోలుగా ఆ మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్‌ చేశారు. ఆ మిల్లు నిర్వాహకులు నరసన్నపేట కొనుగోలు కేంద్రం పేరుతో రాత్రికి రాత్రి ధాన్యం లావాదేవీలను ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. ‘సాక్షి’ కథనం అక్షర సత్యం కావడంతో అనంత్‌పై చర్య తీసుకున్నారు. అయితే ఆయన ఒక్కరే బాధ్యులని చెప్పడానికి లేదు. వాస్తవంగానైతే ఆ లాగిన్‌ అనంత్‌ పరిధిలోనిది కాదు. ఒక అధికారి పరిధిలో ఉంటుంది. ఆ అధికారి లాగిన్‌ నుంచే మిల్లుల ట్యాగింగ్‌ జరగాలి. అలాంటిది అధికారి లాగిన్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ అడ్డగోలుగా మిల్లులు ట్యాగ్‌ చేయడం వెనక మరికొన్ని శక్తులు ఉండొచ్చని తెలుస్తోంది.   

అడ్డగోలుగా వ్యవహరిస్తే వేటు తప్పదు  
ధాన్యం కొనుగోలు విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా వేటు తప్పదు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే మా లక్ష్యం. రైతులకు ఇబ్బందులున్నా, సమస్యలు ఎదురైనా నేరుగా మాకు తెలియజేయవచ్చు. 
– కె.శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌  

మరిన్ని వార్తలు