‘ఉపాధి’ నిధులు బొక్కేశారు

30 Oct, 2013 03:50 IST|Sakshi

 వేటపాలెం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పనుల్లో ఉద్యోగుల అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. సోషల్ ఆడిట్‌లో అక్రమాలు బయటపడుతున్నాయి. వేటపాలెం మండలంలో జరిగిన ఉపాధి పనులపై మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సామాజిక తనిఖీ సభలో రూ. 16 లక్షల అవినీతి వెలుగులోకి వచ్చింది. మండలంలో 2012-13 సంవత్సరానికి సంబంధించిన పనులపై సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ నిర్వహించాయి.  గత ఏడాది మండల పరిధిలో 250 పంట కాలువల పూడికతీత పనులు, 850 ఐఎస్‌ఎల్‌ఎస్ పనులు రూ. 90 లక్షలతో చేపట్టారు. వీటిపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలింది.
 
అత్యధికంగా అక్కాయిపాలెం పంచాయతీ పరిధిలో 45 పనులకు  రూ. 22.83 లక్షలు ఖర్చుచేశారు. అందులో రికార్డుల్లో కూలీల పేర్లపై సిబ్బంది వేలిముద్రలు వేసి రూ. 12,79,855 అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వాస్తవంగా కూలీలు మూడు, నాలుగు వారాలు పనిచేయగా సిబ్బంది 17 వారాలు పనిచేసినట్లు రికార్డుల్లో వేలిముద్రలు వేసి సొమ్ము కాజేశారు. కూలీలను విచారించగా తాము కేవలం నాలుగు వారాలు మాత్రమే పనిచేశామని తెలిపారు. 363 పింఛన్లు ఉండగా వీటిల్లో పింఛన్లు పంచకుండా సీఎస్‌పీ రూ. 63 వేలు డ్రాచేసుకుంది. గ్రామంలో 90 శాతం మంది కూలీల వద్ద జాబ్‌కార్డులు లేవు. తనిఖీ నివేదికలు సభలో చదివి వినిపించారు. దీనిపై ఫీల్డు అసిస్టెంట్ శివకృష్ణను అధికారులు వివరణ కోరగా టెక్నికల్ అసిస్టెంట్ రవి దొంగ రికార్డులు తయారు చేయమంటే చేశానని తప్పును అంగీకరించాడు. సభకు హాజరైన సర్పంచ్ జంగిలి కోటేశ్వరరావు, గ్రామపెద్దలు మాట్లాడుతూ ఫీల్డు అసిస్టెంట్ అవినీతికి పాల్పడి గ్రామదేవాలయానికి చందా ఇస్తానని నిర్భయంగా గ్రామస్తులకు ఆశచూపాడని అధికారుల దృష్టికి తెచ్చారు. అక్కాయిపాలెం నుంచి గ్రామస్తులు, సర్పంచ్ ట్రాక్టర్‌లో తరలి వచ్చి అవినీతిపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
అనంతరం పాపాయిపాలెం పంచాయతీ పరిధిలో జరిగిన తనిఖీ నివేదికలు చదివారు. రూ. 18 లక్షల విలువైన వివిధ పనులు చేయగా కూలీల పేర్లతో రికార్డులు సృష్టించి అక్రమంగా లక్ష రూపాయల అవినీతికి పాల్పడినట్లు తేలింది. గ్రామంలో పోలేరమ్మ దేవాలయం నుంచి సిమెంటు రోడ్డు వరకు పంట కాలువ పూడికతీత పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే గ్రామస్తులు మాజీ సర్పంచ్ పులివెంకటేశ్వర్లు, మరికొంత మంది గ్రామపెద్దలు మాట్లాడుతూ కాలువ పనులు చేయకుండానే చేసినట్లు కూలీల రికార్డుల్లో చూపారని అధికారులకు తెలిపారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని తెలిపినందుకు ఫీల్డు అసిస్టెంట్ పులి నాగరాజు కూలీలు, గ్రామస్తులపై దాడిచేశాడని ఫిర్యాదు చేశారు. ఫీల్డు అసిస్టెంట్ నాగరాజు పోలీస్ స్టేషన్‌లో తమపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులను గ్రామానికి పంపి గ్రామసభకు రాకుండా అడ్డగించారని ఆరోపించారు. పాపాయిపాలెం నుంచి దాదాపు మూడు ట్రాక్టర్‌లలో కూలీలు, మహిళలు సభకు తరలి వచ్చారు.  
 
 దేశాయిపేట పంచాయతీలో 32 పనులకు రూ. 8.58 లక్షలు ఖర్చు చేశారు. పంట కాలువల పూడికతీత పనుల్లో కూలీలపేర్లతో వేలిముద్రలు వేసి రూ. 2.50  లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. మిగిలిన ఆరు పంచాయతీల్లో వేటపాలెంలో రూ. 4 వేలు, పుల్లరిపాలెంలో రూ. 3 వేలు, చల్లారెడ్డిపాలెంలో రూ. 30 వేలు, రామన్నపేటలో రూ. 30 వేలు అవినీతి జరిగినట్లు సోషల్ ఆడిట్లో బయటపడింది. ఇవి కాక సామాజిక వన సంరక్షణ పథకంలో పాపాయిపాలెం, అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం, వేటపాలెం గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి  దాదాపు రూ. 5 లక్షలు ఖర్చుచేసినట్లు ఉంది. అయితే ఆశాఖ అధికారులు రికార్డులు ఇవ్వకపోవడంతో వాటి లెక్క తేలలేదు.
 
 మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ..
 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా అవినీతి బయటపడింది. నిర్మాణాలు చేపట్టకుండా చేసినట్లు చూపి నగదు డ్రాచేసినట్లు రికార్డుల్లో బయటపడింది.  దీంతో అవినీతికి పాల్పడిన అక్కాయిపాలెం ఫీల్డు అసిస్టెంట్ శివకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ జీ రవిని సస్పెండ్ చేస్తున్నట్లు, సీఎస్‌పీ బుజ్జమ్మపై క్రిమినల్ కేసు పెడతామని డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ వెంకట్రామిరెడ్డి  తెలిపారు. సభలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ శివనాయణ, క్వాలిటీ కంట్రోల్ డీఈ కే చంద్రశేఖర్, సోషల్ ఆడిట్ విజిలెన్స్ అధికారి సత్యనారాయణ, ఎన్‌ఆర్‌జీఎస్ ఏపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీఓ(పింఛన్లు) కిషన్, ఎంపీడీఓ పీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు