ఉపాధి పోయింది

21 Aug, 2015 04:34 IST|Sakshi

- 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
- టార్గెట్ పూర్తి చేయలేదనే సాకుతో వేటు
- త్వరలో కొత్త వారికి అవకాశం
- బాబు సర్కార్‌పై మండిపడుతున్న బాధితులు
సాక్షి, కడప :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమంటూ ఊరూరా ఊదరగొట్టి.. తీరా అధికారంలోకి వచ్చాక త ద్భినంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను ఇంటికి పంపించిన బాబు సర్కారు.. తర్వాత హౌసింగ్ శాఖలో పని చేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లతోపాటు మెడికల్ డిపార్టుమెంట్‌లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపింది.

తాజాగా జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కీలకంగా పని చేస్తున్న 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా 692 మంది పని చేస్తున్నారు. ఈ ఏడాది టార్గెట్లు పూర్తి చేయలేదన్న సాకు చూపి 171 మందిని తాజాగా తొలగించారు. గ్రామాల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని నెపం పెట్టి వారిని ఇంటికి పంపించారు. ఇందులో దాదాపు 2006 నుంచి  పని చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు.

ప్రభుత్వం ఏ ఏడాది కాఏడాది ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టును రెన్యూవల్ చేస్తూ వస్తోంది. ఇపుడు వీరిని తొలగించి టీడీపీకి అనుకూలురైన వారిని నియమించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకోవడం కోసమే ఉన్న వారిని టార్గెట్ పేరుతో తొలగిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
టార్గెట్లు పూర్తి చేయనందునే తొలగించాం
జిల్లాలో చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఏడాది వారికి ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయలేదు. దీంతో 171 మందిని తొలగించాం. ఇతర జిల్లాల్లో 300 నుంచి 500 మంది వరకు తొలగించారు. వైఎస్సార్ జిల్లాలోనే అతి తక్కువ మంది టార్గెట్లు పూర్తి చేయలేకపోయారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వారిని తొలగించాము.
 -  బాలసుబ్రమణ్యం, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా

>
మరిన్ని వార్తలు