ఉపాధి హామి ‘ప్రచార’ పథకం

19 Mar, 2019 09:56 IST|Sakshi
ఏఆర్వోఓ ఆదిమహేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు 

ఉపాధి హామి పథకం అంటే చెరువుల పూడిక తీయడమో, కాలవలు తవ్వడమో, మొక్కలు నాటడమో ఉంటుంది కాని సదరు మంత్రి ఇలాకాలో మాత్రం ఉపాధి హామి ప్రచార పథకంగా మారింది. తన తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చాలు పనికి వెళ్లకున్నా వారం రోజులు హాజరు పడుతుంది. ఇదిలా ఉంటే మాకు పని కల్పించి వేతనం ఇవ్వండి మహాప్రభో.. మీ ఎన్నికల ప్రచారం మీరే చేసుకోండి అంటూ ఉపాధిహామి వేతనదారులు వేడుకోవడం కొసమెరుపు.

సాక్షి, కోటబొమ్మాళి: టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్‌ కార్యక్రమానికి తరలివస్తే వారం రోజులు పనికి రాకుండానే మస్టర్లు వేస్తామని మండలంలోని ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు హామీ ఇస్తూ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఉపాధిహామీ వేతనదారులు ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు మండలంలోని చీపుర్లపాడు, లఖందిడ్డి, ఎత్తురాళ్లపాడు, జర్జంగి, హరిశ్చంద్రపురం, అక్కయ్యవలస, గంగారాం తదితర పంచాయతీలకు చెందిన ఉపాధి వేతన దారులు ఆరోపించారు.  

లఖందిడ్డి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సంజీవరావు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్‌లో ఉపాధి పనులు లేకుండా చేస్తామని బెదిరించాడని లఖందిడ్డి, మూలపేట గ్రామాలకు చెందిన వేతనదారులు బమ్మిడి ఆదినారాయణ, పైడి జగన్నాథరావు, బమ్మిడి శ్రీరాములు, మూల సింహాచలం, మూల గోవిందరావు, మూల జోగారావు, బమ్మిడి అమ్మలు, పైడి అన్నపూర్ణ,  పైడి ఉత్తరమ్మ, పైడి వేణమ్మ తదితరులు ఆరోపించారు. ఈ నెల 20 వ తేదీన మంత్రి  అచ్చెన్నాయుడు  టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని మండలంలో గల  అన్ని పంచాయతీల çపరిధుల్లోని ఉపాధి వేతనదారులకు సంబంధిత ఫీల్డు అసిస్టెంట్లు హుకుం జారీచేసినట్లు వేతనదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లఖందిడ్డి వేతనదారులు స్పష్టం చేశారు.  
 

ఫీల్డ్‌ అసిస్టెంట్లను తప్పించాలి
శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అధికార పార్టీకి అండగా ఉంటూ పింఛన్లు , ఇతర పథకాల గురించి ప్రచారం చేస్తూ టీడీపీకి ఓటేయాలని, లేకుంటే పింఛన్లు రద్దు చేస్తామని బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చీపుర్లపాడు పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నేతింటి అప్పలస్వామి, చల్లరాము, కాకి లక్ష్మణరావు, నెయ్యిల సురేష్‌ తదితరులు ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి కె. ఆది మహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.  ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఇప్పిలి రమేష్‌ను, అలాగే ఇతర ఫీల్డ్‌ అసిస్టెంట్లను సంక్షేమ పథకాల పంపిణీ భాద్యత నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ ఎం.సతీష్‌కు వినతిపత్రాన్ని అందించారు. 


             

మరిన్ని వార్తలు